ప్రత్యేక పోలీసు అధికారులై ఉండి ఉగ్రవాదంలోకి..
జమ్మూ: జమ్మూకశ్మీర్లో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు గత నెల రోజుల వరకు భారత బలగాల్లో ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీవో) పనిచేసినట్లు డిఫెన్స్ పీఆర్వో ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వీరిద్దరు దోడా జిల్లాలో గత సెప్టెంబర్ 6, 7న పోలీసు విధుల నుంచి ఆయుధాలతో సహా తప్పించుకుని వెళ్లి ఉగ్రవాదులతో చేతులు కలిపి అందులో చేరినట్లు వెల్లడించారు. గతంలోనూ వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అప్రూవర్గా మారడంతో ఆర్మీకి సహాయం చేసే ప్రత్యేక పోలీసు అధికారుల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
గురువారం ఉదయం దోడి జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్ కౌంటర్ లేకుండా దోడా జిల్లా గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉండగా గురువారంనాటిదే తొలి సంఘటన. కాల్పుల అనంతరం మృతదేహాలను గులాం నబీ మాంగ్ నూ అలియా మౌల్వీ అలియాస్ గుల్లా టైలర్, మరొకరు రియాజ్గా గుర్తించారు. వీరిలో మౌల్వీ లష్కరే తోయిబా జిల్లా కమాండర్గా ఉన్న సమయంలో 2010లో పోలీసులకు లొంగిపోయి ఎస్పీవోగా మారాడు.
ఇక రియాజ్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ టెర్రరిస్టుగా ఉండి 2010లో ఆర్మీకి లొంగిపోయి ఎస్పీవోగా చేరాడు. లష్కరేతోయిబాలో 2003లో మౌల్వీ చేరగా, హిజ్బుల్ సంస్థలో రియాజ్ 1999 చేరాడు. గత నెలలోనే తిరిగి వారు ఎస్పీవో బాధ్యతల నుంచి తప్పించుకుని ఆయుధాలతో సహా వెళ్లి మళ్లీ ఉగ్రవాద సంస్థలో చేరిపోయినట్లు సైన్యం గుర్తించింది. ఈ క్రమంలో వారి అలికిడి దోడా జిల్లాలో ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లో వారిద్దరు హతమయ్యారు. ఏకే 47, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్ను, ఇతర మందుగుండు సామాగ్రిని పోలీసులు, సైన్యం స్వాధీనం చేసుకుంది.