నీతి ఆయోగ్ బంపర్ బహుమతులు
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ సంస్థ భారీ ప్రోత్సాహకాలను, అవార్డులను ప్రకటించింది. రెండు పథకాలు ప్రవేశపెట్టనుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం ప్రకటించారు. వినియోగదారులకు, వ్యాపారస్తులను ఈ ప్రత్యేక బహుమతులను అందించనుంది. లక్కీ గ్రాహక్ యోజన , డిజిధన్ వ్యాపారి యోజన అనే రెండు కొత్త పథకాలను ప్రకటించింది. ఈ డిజిటల్ చెల్లింపులు ప్రచారం కోసం రూ 340 కోట్ల రూపాయలను కేటాయించినట్టు వెల్లడించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమితాబ్ కాంత్ నగదురహిత లావాదేవీల ప్రోత్సాహకానికి గాను ఈ రెండు పథకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ నెల 25నుంచే ఈ రెండు పథకాలు అమల్లోకి తీసుకు రానున్నామన్నారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రోజూ 15 వేల మంది వినియోగదారులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని చెప్పారు. డిజిధన్ వ్యాపారి యోజన కింద వారానికి 7వేల మంది వ్యాపారస్తులని ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామని వెల్లడించారు.
అయితే ప్రయివేట్ వాలెట్ల చెల్లింపులకు ఈ ప్రోత్సాహకాలు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. 50 వేలనుంచి మూడు వేల లోపు ఆన్ లైన్ లావాదేవీలకు ఈ బహుమతులు వర్తిస్తాయి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన విజేతలకు ఏప్రిల్ 14, 2017న ఈ మెగా బహుమతులను ప్రదానం చేయనున్నారు.
వినియోగదారులకు బంపర్ బహుమతులు
- మొదటి బహుమతి కోటిరూపాయలు
- రెండవ బహుమతి రూ.50 లక్షలు
- మూడవ బహుమతి రూ.25 లక్షలు
వ్యాపారస్తుల బంపర్ బహుమతులు
- మొదటి బహుమతి రూ.50 లక్షలు
- రెండవ బహుమతి రూ.25 లక్షలు
- మూడవ బహుమతి రూ.5 లక్షలు