తమిళనాడులో దీపావళి టపాసుల తయారీకి సుప్రసిద్ధమైన శివకాశిలో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు టపాసు తయారీ కేంద్రాలు కాలిపోయాయి. అయితే, ఈ సంఘటనలో ఎవరైనా చనిపోయారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. చిదంబరం ఫైర్ వర్క్స్ దుకాణంలో చెలరేగిన మంటలు వెనువెంటనే పక్కనే ఉన్న కృష్ణస్వామి ఫైర్ వర్క్స్ దుకాణానికి కూడా అంటుకున్నాయి. సమాచారం తెలియగానే మూడు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మధ్యాహ్నం 1.20 వరకు మంటలను అదుపు చేశాయని శివకాశి అగ్నిమాపక దళం అధికారి ఒకరు తెలిపారు. అయితే, మంటలను అదుపుచేస్తున్న సమయంలోనే పేలుడు శబ్దాలు కూడా వినిపించినట్లు ఆయన చెప్పారు.
మంటలు అంటుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుండగా 50 ఏళ్ల మహిళ ఒకరికి కాలిన గాయాలైనట్లు మరనేరి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. పార్తీపన్ చెప్పారు. సరిగ్గా భోజన విరామ సమయంలోనే అగ్నిప్రమాదం జరగడంతో ఎక్కువ మంది కార్మికులు ఆయా దుకాణాలలో లేకపోవడం వల్ల నష్ట తీవ్రత కొంతవరకు తగ్గింది. టపాసుల తయారీ కేంద్రాలు పోలీసు స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలోను, శివకాశి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలోను ఉన్నాయి. చిదంబరం ఫైర్ క్రాకర్ యూనిట్లో ఫ్యాన్సీ టపాసులు ఎక్కవుగా తయారుచేస్తారు.
దేశంలోనే టపాసుల తయారీ విషయంలో శివకాశి చాలా ప్రసిద్ధి చెందింది. దేశంలోని మొత్తం టపాసులలో 90 శాతం ఇక్కడే తయారవుతాయి. అలాగే 80 శాతం అగ్గిపెట్టెలు కూడా ఇక్కడే రూపొందుతాయి. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటం, పొడి వాతావరణం ఉండటం వల్ల ఏడాది పొడవునా టపాసుల తయారీ కొనసాగుతుంటుంది. టపాసుల వ్యాపారం టర్నోవర్ సుమారు 2వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
శివకాశి టపాసుల తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదం
Published Thu, Aug 22 2013 4:40 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement