ఆ ఇద్దరు అంతరిక్షం నుంచే ఓటు వేసేశారు!
Published Tue, Nov 8 2016 11:26 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
వాషింగ్టన్ : డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా..నేనా అంటూ పోటీపడుతున్న అమెరికా అధ్యక్ష పీఠ ఎన్నికల సమరం మొదలైంది. సుమారు నాలుగుకోట్ల మంది ముందస్తు ఓటింగ్ వేయగా... మిగిలినవారు నేడు జరిగే పోలింగ్లో పాల్గొంటున్నారు. భూమికి 17వేల మైళ్ల దూరంలో ఇద్దరు అమెరికన్ వ్యోమగాములూ అంతరిక్షం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేన్ కిమ్బ్రో వ్యోమగామి అధికారికంగా తన ఓటు హక్కును ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకున్నట్టు నాసా ప్రకటించింది. మరో వ్యోమగామి కేట్ రాబిన్స్ కూడా తను భూమిపైకి వచ్చే వారం ముందు అంతరిక్షం నుంచి ఓటు వేసినట్టు తెలిపింది.
1997లో టెక్సాస్ చట్టసభలు పాస్ చేసిన బిల్లు వల్ల ఇది సాధ్యమైందని, ఆస్ట్రోనాట్స్ కోసం ఈ టెక్నికల్ ఓటింగ్ ప్రక్రియను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఓటు వేసిన ఈ ఇద్దరు వ్యోమగాములు జాన్స్సన్ స్పేస్ సెంటర్ సమీపంలోని హోస్టన్ ప్రాంతానికి చెందిన వారు. ఏ ఎలక్షన్(స్థానిక/రాష్ట్ర,/ ఫెఢరల్)ను వారు వినియోగించుకోవలనుకుంటున్నారో తెలుపడంతో ఏడాది కిందటి నుంచే వ్యోమగాముల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో వారు అంతరిక్షం నుంచే ఓటు వేయొచ్చని పేర్కొంది.
ఎన్నికలు ప్రారంభమవడానికి ఆరు నెలల ముందుకు వ్యోమగాములకు స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు. అది ఓటర్ రిజిస్ట్రేషన్, స్థలాంతర బ్యాలెట్ రిక్వెస్ట్-ఫెడరల్ పోస్టు కార్డు అప్లికేషన్ అని ఏజెన్సీ పేర్కొంది. 1997లో మొదటిసారి ఉపయోగించిన ఈ స్పేస్ ఓటింగ్ను, నాసా వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్ తొలుత అంతరిక్షం నుంచి ఓటు వేశారు. దీంతో అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి అమెరికన్ వ్యోమగామిగా ఆయన పేరొందారు.
Advertisement
Advertisement