మరణంలోనూ అతని వెంటే ఆమె..
లండన్: తనవుకొక మనసుగా 70 ఏళ్లు కలిసి జీవించారు. ఏడాది కిందట ఆ భర్త మతిమరుపు వ్యాధికి గురయ్యాడు. భార్యను గుర్తుపట్టడం మానేశాడు. ఇది భరించలేని ఆమె ఆస్పత్రి పాలైంది. భర్త కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందాడు. చివరికి ఒక ఉదయాన భర్త కన్నుమూశాడు. అతను చనిపోయిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఆమె కూడా తుది శ్వాస విడిచింది! బ్రిటన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లిస్టర్‌షైర్‌లోని విగ్‌స్టన్‌లో నివసించే విల్ఫ్ రసెల్(93) బ్రిటిష్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాడు. అదే సమయంలో వెరా అనే పడతిని ప్రేమించి, పెళ్లాడాడు. యుద్ధం తర్వాత ఇంజనీర్‌గా సెటిల్ అయ్యాడు. ఆదిదంపతులుగా విరాజిల్లుతూ పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కాలం గడిపారు. కాగ, గత ఏడాది రస్సెల్ మతిమరుపు వ్యాధికిగుర్య్యాడు. భార్య సహా దేనినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లాడు. 70 ఏళ్ల అనురాగం ఊహించని విధంగా ముక్కలయ్యేసరికి వెరా తట్టుకోలేకపోయింది. మనోవేదనతో మంచం పట్టింది. పిల్లలు వాళ్లిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు.
డాక్టర్ల సూచనమేరకు రెండు నెలల కిందట రస్సెల్‌ను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత బుధవారం ఉదయం 6:50కి అతను ప్రాణాలు విడిచాడు. సరిగ్గా నలుగు నిమిషాల్లోనే.. భర్త మరణవార్త తెలియకముందే వెరా(91) కూడా చనిపోయింది. ‘బహుశా.. ఇద్దరం కలిసే పోవాలని వాళ్లు అనుకుని ఉండొచ్చు. నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది’ అని రస్సెల్ మనవడు మీడియాకు చెప్పాడు.