అడుగు తడబడి అనంతలోకాలకు...
* మంచంపై నుంచి లేవబోతూ కిందపడ్డ గర్భిణి
* గర్భస్థ శిశువు సహా కన్నుమూత
మలికిపురం : కొద్దిరోజుల్లోనే మంచం మీద తన పక్కనే పొత్తిళ్లలో వెచ్చగా ఒదిగి ఉండే బిడ్డను అపురూపంగా చూసుకుంటూ మురిసిపోవలసిన ఆ తల్లి.. ఆ ముచ్చట తీరకుండానే ఈ లోకాన్ని వీడింది.మంచం మీద నుంచి లేచే ప్రయత్నంలో అడుగు తడబడి, తూలి కిందపడి, తలకు తీవ్రగాయమై ఆమె కన్నుమూసింది. కడుపులోని బిడ్డా కన్ను తెరవకుండానే కడతేరిపోరుుంది.
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జరిగిన ఈ విషాదఘటన వివరాలు ఎస్సై విజయబాబు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నారుు.గ్రామానికి చెందిన బుడితి సత్యవతి (24)కి ఏడాది కిందట పెద కందాలపాలెంకు చెందిన యువకునితో పెళ్లరుుంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. గర్భం ధరించిన సత్యవతి పురుడు పోసుకునేందుకు శంకరగుప్తానికే చెందిన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల.
గురువారం ఉదయమే ఆమె ప్రసవం నిమిత్తం లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటాక సత్యవతి బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు మంచం నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడింది. దాంతో తలకు తీవ్రగాయమై ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆమెను తొలుత లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించమన్నారు.అక్కడికి చేరుకునే సరికే సత్యవతి కడుపులోని బిడ్డతో సహా కన్నుమూసింది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.