మాల్యా వాటాలను హీనెకెన్ కొనేస్తోందా?
న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమెటెడ్ లో విజయ్ మాల్యాకుచెందిన మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు డచ్ బ్రూవర్ హైనెకెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్లో విజయ్ మాల్య వాటాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతొ రుణదాతలతో హీన్‌కెన్ సంప్రదించినట్టు సమాచారం.
బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యానుంచి రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కీలక పరిణామమని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హీనెకెన్ నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఇది బ్యాంకులపై ఒత్తిడిని రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది.
హీనెకెన్, విజయ్ మాల్యా యూబిఎల్ కంపెనీలో ఉమ్మడి యజమానులుగా ఉన్నారు. మాల్యాకు 30శాతం వాటా వుండగా, హెన్‌కెన్ 43.4 శాతం వాటాకలిగి ఉంది. దీంతో మార్కెట్లో యూబీఎల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. దాదాపు 6.23 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు ఈ వార్తలతో స్టాక్ ఎక్సేంజ్ లు హెన్‌కెన్ సంస్థను వివరణ కోరింది.
కాగా గత ఏడాది మార్చిలో ఇండియా నుంచి పారిపోయని మాల్యాను గత నెల ఏప్రిల్ 18న లండన్ లో స్కాట్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు అటు ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా భారత ఈడీ, సీఐడి అధికారులు ప్రత్యేక బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. అక‍్కడి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.