సమైక్య ఉద్యమం అప్రజాస్వామికం: కోదండరాం | united movement is undemocratic, says Kodanda ram | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమం అప్రజాస్వామికం: కోదండరాం

Published Sun, Aug 18 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

సమైక్య ఉద్యమం అప్రజాస్వామికం:  కోదండరాం

సమైక్య ఉద్యమం అప్రజాస్వామికం: కోదండరాం

సాక్షి, హైదరాబాద్: సమైక్యవాద ఉద్యమమే రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. ఇష్టం లేని ప్రాంతాలను బలవంతంగా కలిసి ఉండాలంటూ ఉద్యమాలు చేయడమే అప్రజాస్వామికమన్నారు. శనివారమిక్కడ టీఎన్‌జీవో కార్యాలయంలో వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడారు. సీమాంధ్రలోని సమైక్య ఉద్యమాన్ని వివిధ కోణాల్లో చూపిస్తున్న మీడియాలోని ఒకవర్గం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించడం లేదన్నారు.

 

సమైక్య సమ్మెలో ఆర్టీసీ కార్మిక సంఘాలు, 11 ఉద్యోగ సంఘాలు, సింగరేణి కార్మికులు పాల్గొనడం లేదన్నారు. వీటిని మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఉండటం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదని, అయినా కలిసి ఉండాలని ఉద్యమాలు చేయడం ప్రజల హక్కును హరించడమేనని చెప్పారు. ఎవరి హక్కులకోసం వారు పోరాడితే తప్పులేదని, ఇతరులకు హక్కులు లేకుండా చేయడమే అప్రజాస్వామిక ధోరణి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీని కలిసే ఆలోచన జేఏసీకి లేదన్నారు. ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు తెలంగాణలో కార్యక్రమాలు పెట్టుకుంటామంటే అనుమతించని ప్రభుత్వం.. ఏపీఎన్జీవో సభకు ఎలా అనుమతిని ఇస్తుందని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అధికారం ఉద్యోగ సంఘాలకు, నేతలకు ఉన్నా తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు.

 సమావేశంలో చేసిన తీర్మానాలను కోదండరాం మీడియాకు వివరించారు
 హైదరాబాద్ రాజధానిగా, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి.
 హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్‌పై తెలంగాణకు సంపూర్ణ అధికారాలు ఉండాలని ఈ సభ తీర్మానించింది.
 తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రా ప్రాంతంలో రాజధాని ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగా మాత్రమే పరిగణించాలి.
 తెలంగాణపై కేంద్ర కేబినెట్‌లో వెంటనే తీర్మానం చేయాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలి.
 ప్రజల ఆకాంక్షలను నిష్పక్షపాతంగా వ్యక్తీకరించి, ప్రజాస్వామిక విలువలను ప్రతిష్టింపజేయాల్సిన బాధ్యత మీడియాది అని భావిస్తున్నాం. మీడియాలోని ఒక వర్గం సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికలుగా వ్యవహరిస్తూ ప్రజల మధ్య విద్వేషాలను , వైషమ్యాలను రెచ్చగొడుతోంది. మీడియాలోని ఈ పక్షపాత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత విభజనకు మీడియా తోడ్పడాలని కోరుతున్నాం.
 సమైక్యవాద ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకం. ఈ ఉద్యమాన్ని తిరస్కరించి శాంతియుత విభజనకు సహకరించి, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కాపాడటానికి తోడ్పడాలని ఆంధ్రా ప్రజలను కోరుతున్నాం.


 తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లిన ఎంపీ వీహెచ్‌పై దాడికి దిగడం అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను గుర్తించి, కఠినంగా శిక్షించాలి.
 ఈ నెల 19 నుంచి వారంరోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సద్భావనా దీక్షలను చేయాలి. వీటిలో రోజుకు కొన్ని జేఏసీలు పాల్గొనాలి.

 కోదండరాం ఢిల్లీ పర్యటన వివాదం
 జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిశారని, కాంగ్రెస్ పార్టీకి వీరు దగ్గరవుతున్నారని శనివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జేఏసీలోని కొందరు కాంగ్రెస్‌కు దగ్గర అవుతుంటే, మరికొందరు ఇంకో రాజకీయ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై జేఏసీలోనూ చర్చించి నట్టుగా తెలిసింది. ఈ అంశంపై కోదండరాంను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను ఎవరినీ కలువలేదు. పుకార్లను నమ్మవద్దు. సంబంధం లేని అంశాలను అంటగట్టి, జరుగని నిర్ణయాలను జరిగినట్టుగా చిత్రీకరించడం మంచిది కాదు. జేఏసీలో ఏం జరిగినా చర్చించి, ఏకగ్రీవంగా తీర్మానించుకుంటాం. మనుషులు ఎవరైనా తప్పులు చేస్తరు. వాటిని చర్చల ద్వారా సరిదిద్దుకుంటం. జేఏసీలో విభేదాలు లేవు’’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement