సాక్షి, హైదరాబాద్: ఏ కమిటీ వేసుకున్నా తెలంగాణ ఇస్తే చాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు.ఇంకా అఖిలపక్ష కమిటీలు,మంత్రుల కమిటీల పేరుతో ఆలస్యం చేయకుండా తెలంగాణను వెంటనే ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణవాదులు నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించారు. శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. కాగా, నల్లజెండాలను ఎగురవేయకుండా పోలీసులు వాటిని తీసుకుపోయారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇంకా దాగుడు మూతలు ఆడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ నాయకులకు అవకాశాలు ఇంకా రావని, చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఎటువైపు ఉండాలో తెలంగాణ టీడీపీ నాయకులు తేల్చుకోవాలని కోదండరాం సూచించారు. జేఏసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయకుంటే జరుగదని, 371(డి) అని సీమాంధ్ర ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
చైనాగోడ కడతామా: ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్
నదీ జలాలను అడ్డుకోవడానికి తెలంగాణలో చైనా గోడను కట్టబోమని,తెలంగాణకు రావాల్సిన వాటాను మించి ఒక్క టీఎంసీని కూడా అదనంగా వాడుకోబోమని ఎమ్మెల్సీ, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా నల్ల పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల రవీందర్,టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, రేచల్, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్‌ఎల్‌డి నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ఎ.రవి, 1969 ఉద్యమకారుల సంఘం నాయకులు కొల్లూరి చిరంజీవి, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వలసలకు కేంద్రంగా తెలంగాణ: కోదండరాం ఆవేదన
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం 1956లో జరిగిన రెండు సామాజిక ఆర్థిక వ్యవస్థల విలీనమని, దాంతో తెలంగాణ అంతర్గత వలస కేంద్రంగా మారిపోయిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఫజల్ అలీ కమిటీ తెలంగాణ దోపిడీకి గురవుతుందని అప్పట్లోనే ప్రకటించిందన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినం’ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీటీఎఫ్ ఇన్‌చార్జి అధ్యక్షుడు కె.రమణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పక్కన తెలంగాణ మంత్రులా?: టీఆర్‌ఎస్
తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కన తెలంగాణకు చెందిన మంత్రులు ఎలా ఉంటారని టీఆర్‌ఎస్ నేతలు నాయిని నర్సింహ్మా రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో నల్ల జెండాను ఎగురేసిన అనంతరం వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఇదే చివరి విద్రోహదినమని అన్నారు.
తెలంగాణ ఇస్తే చాలు : కోదండరాం
Published Sat, Nov 2 2013 3:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement