K. Dileep Kumar
-
తెలంగాణ ఇస్తే చాలు : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఏ కమిటీ వేసుకున్నా తెలంగాణ ఇస్తే చాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు.ఇంకా అఖిలపక్ష కమిటీలు,మంత్రుల కమిటీల పేరుతో ఆలస్యం చేయకుండా తెలంగాణను వెంటనే ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణవాదులు నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించారు. శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. కాగా, నల్లజెండాలను ఎగురవేయకుండా పోలీసులు వాటిని తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇంకా దాగుడు మూతలు ఆడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ నాయకులకు అవకాశాలు ఇంకా రావని, చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఎటువైపు ఉండాలో తెలంగాణ టీడీపీ నాయకులు తేల్చుకోవాలని కోదండరాం సూచించారు. జేఏసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయకుంటే జరుగదని, 371(డి) అని సీమాంధ్ర ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చైనాగోడ కడతామా: ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ నదీ జలాలను అడ్డుకోవడానికి తెలంగాణలో చైనా గోడను కట్టబోమని,తెలంగాణకు రావాల్సిన వాటాను మించి ఒక్క టీఎంసీని కూడా అదనంగా వాడుకోబోమని ఎమ్మెల్సీ, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా నల్ల పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల రవీందర్,టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, రేచల్, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్ఎల్డి నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ఎ.రవి, 1969 ఉద్యమకారుల సంఘం నాయకులు కొల్లూరి చిరంజీవి, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వలసలకు కేంద్రంగా తెలంగాణ: కోదండరాం ఆవేదన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం 1956లో జరిగిన రెండు సామాజిక ఆర్థిక వ్యవస్థల విలీనమని, దాంతో తెలంగాణ అంతర్గత వలస కేంద్రంగా మారిపోయిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఫజల్ అలీ కమిటీ తెలంగాణ దోపిడీకి గురవుతుందని అప్పట్లోనే ప్రకటించిందన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినం’ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీటీఎఫ్ ఇన్చార్జి అధ్యక్షుడు కె.రమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పక్కన తెలంగాణ మంత్రులా?: టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కన తెలంగాణకు చెందిన మంత్రులు ఎలా ఉంటారని టీఆర్ఎస్ నేతలు నాయిని నర్సింహ్మా రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో నల్ల జెండాను ఎగురేసిన అనంతరం వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఇదే చివరి విద్రోహదినమని అన్నారు. -
కాంగ్రెస్‌తో దిలీప్‌కు సంబంధమేంటి ? : ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.దిలీప్‌కుమార్‌కు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏమిటని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలతో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పిస్తుంటే ఏమనుకోవాలన్నారు. ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ దిలీప్ ఎలా ప్రకటిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర సంపన్నుల చేతిలో పావుగా మారి, ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణకుచెందిన మహిళా ఉద్యోగులపై సీమాంధ్రులు దాడి చేయడం హేయమని ఈటెల విమర్శించారు. మహిళలపై దాడులకు దిగడమే సీమాంధ్ర సంస్కృతా అని ప్రశ్నించారు. ఇలాంటివి మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈటెల హెచ్చరించారు. టీ-ఉద్యోగులపై దాడి అమానుషం : కేకే సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం లో తాము ఏనాడు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం మింట్ కంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీ నామా చేస్తే రెండేళ్ల ముందే తెలంగాణ వచ్చేదన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. విడిపోయే ముందు విద్వేషాలు వద్దు గుంటూరులో తెలంగాణకు చెందిన గ్రూప్-1 అధికారి హనుమంత నాయక్‌పై జరిగిన దౌర్జన్యాన్ని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర గౌడ్ ఖండించారు. విడిపోయే ముందు విద్వేషాలు పనికి రావన్నారు. ప్రాంతాలను బట్టి అధికారులపై దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన హితవుపలికారు. -
పార్లమెంట్‌కు వెళ్లకుండానే.. సంతకం ఫోర్జరీ చేయించిన కేసీఆర్ : దిలీప్
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటుకు వెళ్లకుండానే హాజరు రిజిస్టర్లో సంతకాన్ని ఫోర్జరీ చేయించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు తన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎల్డీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘ దిగ్విజయ్‌సింగ్‌తో నాకు 25 ఏళ్లుగా సాన్నిహిత్యముంది. కొందరు టీఆర్ఎస్ నేతల విన్నపం మేరకే ఆయన్ను వారికి పరిచయం చేశాను. కాంగ్రెస్‌లో వారి చేరికతో నాకు సంబంధం లేదు’ అని వివరిం చారు. అసలు బ్రోకర్లు టీఆర్ఎస్లోనే ఉన్నారని, అన్ని ఆధారాలు తెలంగాణ జేఏసీకి సీల్డ్కవర్లో పంపిస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ క్రాస్ ఓటింగ్ చేయించారని, ఆయనకు ఈ అంశంతో సంబంధం లేకుంటే ఆ ముగ్గురిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. సినీ పరిశ్రమలోని వారిని ఉద్యమం పేరుతో బెదిరించి దండుకున్న కేసీఆర్ కుటుంబసభ్యుల్లో బ్రోకర్ ఎవరో చెప్పాలన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్‌ను అవమానించినవారెవరో కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలని సవాల్ విసిరారు. ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని, గద్దర్‌ను, వరవరరావును, పార్టీలోని దళితనేత డాక్టర్ విజయ రామారావును కేసీఆర్ ఎందుకు అవమానించారో చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు క్రెడిట్ మొత్తం అమరులకే దక్కుతుందన్నారు.