‘అపాయింటెడ్ డే’లో కుట్ర: కోదండరాం
పంపకాలు జరిగేంత వరకు అప్రమత్తంగా ఉండాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన ‘ఆపాయింటెడ్ డే’ ను దూరంగా పెట్టడంలో కుట్ర దాగుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం కీలకమైన స్థానాల్లో సీమాంధ్రకు చెందిన అధికారులే ఉన్నందున పంపకాల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు.విభజన జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే సీమాంధ్రుల ఆగడాలను నిలువరించడానికి అవకాశం ఉండేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలంతా ఏవిధంగా సంఘటితమై పోరాటం చేశారో.. పంపకాలు జరిగేంతవరకు అంతేజాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సీపీఐ-ఎంఎల్(న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం- ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సులో ఆయన మాట్లాడారు.
- వివిధ రంగాల్లో నష్టపోయిన తెలంగాణకు సహా యం చేయాల్సింది పోయి, విభజనవల్ల ఆంధ్రకు అన్యాయం జరుగుతుందంటూ ప్రత్యేక ప్యాకేజీలు, హోదాలు కల్పించడం సరైందికాదన్నారు.
- ఆంధ్రకు 15శాతం టాక్స్ మినహాయింపు ఇస్తే, ఇక్కడున్న పరిశ్రమలు ఉంటాయా? అని ప్రశ్నిం చారు. తెలంగాణపై రాష్ట్రపతి చేసిన సంతకం సిరా ఆరకముందే పోలవరం రూపంలో కేంద్రం తెలంగాణకు ద్రోహం తలపెట్టిందని విమర్శించారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మిలియన్‌మార్చ్ లాంటి ఉద్యమాల్లో న్యూడెమోక్రసీ పాత్ర చాలా కీలకమైనదని టీజేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య చెప్పారు.
- తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా జేఏసీ పాత్ర ఉండాలని సీపీఐ-ఎంఎల్(న్యూడెమోక్రసీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.గోవర్దన్ కోరారు.