ఎన్నికల్లో పోటీచేయను: కోదండరాం
కేసీఆర్‌తో భేటీ.. గంటన్నర చర్చలు
ఉద్యమాల్లోనే ఉంటూ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటానన్న జేఏసీ నేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీఎన్‌జీవో అధ్యక్షులు దేవీ ప్రసాద్ సమావేశమయ్యారు. కేసీఆర్ నివాసంలోనే బుధవారం వీరు సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చాలా అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందు, ఆ తరువాత ఢిల్లీలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్‌తో జరిగిన చర్చలు, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు, సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, దానికి సంబంధించిన ప్రధానమంత్రి ప్రకటన వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోటి నుంచి పోటీ చేయాలని కోదండరాంను కేసీఆర్ ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పాటు కాబోయే ప్రభుత్వాలపై ఒత్తిడి కోసం ప్రజా సంఘాల ఆవశ్యకత ఉందని, అలాంటి ఉద్యమాల్లో ఉంటూ పునర్నిర్మాణం కోసం పాటు పడతానని కోదండరాం సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న పరిచయాలతో పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి అవకాశంగా ఉంటుందని, ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడానికి ఇదొక అవకాశంగా ఈ ప్రతిపాదన చేసినట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ప్రతిపాదన చేసినందుకు కృతజ్ఞతలు అని, పోటీ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని సున్నితంగా తిరస్కరించినట్టుగా కోదండరాం విలేకరులకు వెల్లడించారు.