అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో లిస్ట్‌కావచ్చు
ముంబై: అన్‌లిస్టెడ్ కంపెనీలు సరాసరి విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతించింది. తద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు అవకాశాలను కల్పించింది. అంతేకాకుండా విదేశీ రుణాలను చెల్లించేందుకు కూడా ఈ నిధులను వినియోగించుకునేందుకు దేశీయ అన్‌లిస్టెడ్ కంపెనీలకు వీలుచిక్కనుంది. ప్రభుత్వం గరిష్టస్థాయి కరెంట్ ఖాతాలోటుతో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా చర్యలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఇంతవరకూ ఉన్న నిబంధనల ప్రకారం అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్‌అయ్యేందుకు వీలులేదు.
ఇందుకు ముందుగా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంటుంది. అయితే ఈ నిబంధనల తాజా సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్‌అయ్యేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీలను అనుమతిం చేందుకు నిర్ణయించింది. ఇందుకు వీలుగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తొలి దశకింద రెండేళ్ల గడువును విధించింది. పరిశీలనార్థం ఈ గడువును విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే సెబీతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న ఐవోఎస్‌సీవో, ఎఫ్‌ఏటీఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్ల ద్వారా మాత్రమే లిస్టయ్యేందుకు కంపెనీలను అనుమతిస్తారు. కాగా, నిధులను సమీకరించాక విదేశాలలో వాటిని వినియోగించని పక్షంలో, వాటిని 15 రోజుల్లోగా దేశీయంగా వాణిజ్య బ్యాంకులలో జమ చేయాల్సి ఉంటుంది.