తెలంగాణ డీజీపీ రేసులో 'ఆ ముగ్గురు'
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంలో మూడు పేర్లను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సూచించినట్లు తెలుస్తోంది. . డీజీపీ నియామక నియమావళిని అనుసరించి ఆ పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు. తుది జాబితాలో అరుణా బహుగుణ, కోడె దుర్గాప్రసాద్, అనురాగ్ శర్మ చోటు దక్కింది. ఈ ముగ్గురిలో ఒకరిని తెలంగాణ ప్రభుత్వం నూతన డీజీపీగా ఎంపిక చేయనుంది.
తెలంగాణ ప్రభుత్వం గతవారం యూపీఎస్సీకి అయిదుగురి పేర్లను పంపిన సంగతి తెలిసిందే. ఆ జాబితాతో పాటు ఆయా అధికారుల సీనియారిటీ, మెరిట్, అనుభవం, నిర్వహించిన పోస్టులు, సాధించిన పతకాలు, సమర్థత, ఎదుర్కొన్న వివాదాలు, మిగిలున్న సర్వీసు కాలం తదితరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వం పంపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితా నుంచి ముగ్గురు అధికారుల పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతుంది.
ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది. యూపీఎస్సీ సిఫార్సు చేయనున్న ముగ్గురు అధికారుల్లో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయవచ్చనే దానిపై రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డీజీపీల నియామకాల్లో సీనియారిటీ, ఇతర నిబంధనలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావాల్సిన వారినే నియమిస్తుండడంతో దీనిపై ప్రతిసారీ న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి.
కాగా నేషనల్ పోలీస్ అకాడమి డైరెక్టర్‌గా అరుణా బహుగుణ, సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కోడె దుర్గాప్రసాద్ కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. అలాగే అనురాగ్ శర్మ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అనురాగ్ శర్మకే పూర్తిస్థాయి డీజీపీగా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్, తేజ్ దీప్ కౌర్ పేర్లను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీ తిరస్కరించింది.