అమెరికా మరిన్ని ఆంక్షలు!
వాషింగ్టన్: తమ దేశంలోకి ప్రవేశించే విదేశీ పౌరులపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం విదేశీ వలసదారులపై నియంత్రణలను పెంచాలని యోచిస్తోంది.
తమ దేశానికి వచ్చే విదేశీయులు వారి ఫోన్ నంబర్లను, సోషల్ మీడియా వివరాలను, ఇంటర్నెట్‌లో వారు శోధించిన అంశాల గురించి తెలిపే బ్రౌజింగ్ హిస్టరీని అందజేయాలనే షరతులను విధించే అవకాశాలపై అధికార యంత్రాంగం చర్చిస్తోందని వైట్‌హౌస్ పాలసీ డైరెక్టర్ స్టీఫెన్ మిల్లర్ తెలిపారు. ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించే వారిని అమెరికాలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. దీనిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
విదేశీయుల ఫోన్ నంబర్ల వివరాలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ అడగడం అన్యాయమని నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ(ఎన్‌ఎస్ఏ) మాజీ సీనియర్ లాయర్ ఆప్రిల్ దాస్ విమర్శించారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సముచితం కాదని పేర్కొన్నారు. ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.