
మోదీపై అమెరికా ఎక్స్‌పర్ట్స్ ఆసక్తికర విశ్లేషణ
వాషింగ్టన్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. 2019 లోక్‌సభ ఎన్నికల ఫేవరెట్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని తేలిపోయిందని అమెరికా టాప్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారత్ వ్యవహారాలను నిశించి పరిశీలించే అమెరికా నిపుణులు తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అసహజమైనవి కావని తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయని ఓ విశ్లేషకుడు అభిప్రాయపడగా.. 2019లోనూ మోదీ హవానే కొనసాగనుందని మరో నిపుణుడు పేర్కొన్నారు. ’ఇది బీజేపీకి చాలా పెద్ద విజయం. గత రెండు పర్యాయలలో విజయం సాధించిన బీఎస్పీ, ఎస్పీతో పోలిస్తే.. ఆ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందింది’ అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఆడం జీగ్‌ఫెల్డ్ పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో విజయంసాధించే ఫేవరెట్ అభ్యర్థి మోదీయేనని స్పష్టంగా తేలిందంటూ అమెరికన్ ఎంటర్‌ప్రైస్ ఇన్‌స్టిట్యూట్ రెసిడెంట్ ఫెలో సదానంద్ ధుమే పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆధిక్యం సాధించేది మోదీయేనని ఆయన అన్నారు. అయితే, జార్జ్‌టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఇర్ఫాన్ నూరుద్దిన్ కాస్త భిన్నమైన అంచనా వేశారు. 2019 ఎన్నికల్లో మోదీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చునని, కాబట్టి బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని అంచనా వేశారు. బీజేపీ ఎంతో క్రమశిక్షణతో రాష్ట్రం మరొక రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ లబ్ధి పొందుతుండగా.. ప్రతిపక్షాలు ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు.