అమెరికా ‘షట్‌డౌన్’కు తెర..!
అమెరికా ‘షట్‌డౌన్’కు తెర..!
Published Thu, Oct 17 2013 2:20 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
వాషింగ్టన్: రెండు వారాలకుపైగా కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల నిలిపివేత (షట్‌డౌన్), రుణ పరిమితి పెంపు సంక్షోభానికి సంబంధించి పాలక డెమోక్రాట్లు-ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒక అంగీకారానికి వచ్చారు. టాప్ సెనేట్ నాయకులు బుధవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. దీనితో డిఫాల్ట్ గడప ముందు ఉన్న అమెరికాకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. షట్‌డౌన్‌కు తెరపడి.. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. సెనేట్ మెజారిటీ డెమోక్రాటిక్ నేత హ్యారీ రీడ్ ఒప్పందం కుదిరిన విషయాన్ని సెనేట్‌లో వెల్లడించారు. తమ రాజీ ఒప్పందం అమెరికా ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లకు పట్టున్న హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్(ప్రతినిధుల సభ) దీనిపై త్వరలో ఓట్ చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు.
సెనేట్‌లో రిపబ్లికన్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్‌కన్నెల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘ఈ వారం అంతా ప్రపంచం కళ్లన్నీ వాషింగ్టన్ మీద ఉన్నాయి. రాజకీయ వైరుధ్యాల తొలగింపు దిశలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనివల్ల అటు ప్రభుత్వం షట్‌డౌన్ సమస్యకు, ఇటు రుణ డిఫాల్ట్ సమస్యకు పరిష్కారం లభించనుంది’’ అని హరీ రైడ్ అన్నారు. కొత్త రాజీ ఒప్పందం ప్రకారం, ప్రభుత్వం కార్యకలాపాలు వచ్చే జనవరి 15 వరకూ తిరిగి యథాతథంగా నడిచేందుకు వీలవుతుంది.
అదేవిధంగా వచ్చే ఫిబ్రవరి 7 వరకూ ప్రభుత్వం రుణ సమీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదు. దీనిప్రకారం, ఇక వివాదాస్పద ఒబామాకేర్ చట్టం జోలికీ వెళ్లరు. ఫలితంగా ఇరుపక్షాలూ బడ్జెట్, రుణ పరిమితి పెంపు అంశాలపై ఒక దీర్ఘకాలిక ఒప్పందానికి వచ్చేందుకు, తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు కొంత వ్యవధి చిక్కుతుందని హ్యారీ రీడ్ తెలిపారు. కాగా, ఒప్పందం కుదిరినట్లు హరీ రైడ్ ప్రకటించినా... కొందరు అతివాద రిపబ్లికన్‌లు బిల్లులను వ్యతిరేకించే ప్రమాదం లేకపోలేదని వార్తలొస్తున్నాయి. అయితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, మితవాద రిపబ్లికన్‌ల మద్దతుతో బిల్లు పాసవ్వొచ్చని పరిశీలకులు అంచనా.
బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో రెండు వారాలకుపైగా(బుధవారానికి 16 రోజులు) కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్)కు రుణ పరిమితి పెంపు గండం కూడా ఆజ్యం పోసింది. దీంతో.. అమెరికా రుణాల తిరిగిచెల్లింపుల విషయంలో చేతులెత్తేసే(డిఫాల్ట్) పరిస్థితికి దారితీస్తుందనే భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే దేశ రుణ పరపతి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయొచ్చని టాప్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించింది. కాగా, రుణ పరిమితిని ఇప్పుడున్న 16.7 లక్షల కోట్ల(ట్రిలియన్) డాలర్ల నుంచి పెంచడం అమెరికాకు తక్షణావసరం. దీనికి నేటి(17న) అర్ధరాత్రితో గడువు ముగియనుంది.
మంటగలుస్తున్న అమెరికా ప్రతిష్ట...
ఒబామా ఆరోగ్య బీమా పథకం(ఒబామాకేర్)పై వ్యతిరేకతతో రిపబ్లికన్‌లు బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో.. 17 ఏళ్ల తర్వాత తొలిసారి షట్‌డౌన్‌కు దారితీసింది. దీంతో 8 లక్షల మందికిపైగా ప్రభుత్వోద్యోగులు విధులకు దూరమయ్యారు. అత్యవసర సేవలు మినహా ఇతర ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుమ్ములాటలతో అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ ప్రతిష్టపై కూడా మాయనిమచ్చపడిందని అక్కడి మీడియా, ఆర్థిక నిపుణులు కూడా తీవ్రంగానే దుమ్మెత్తిపోస్తున్నారు.
డిఫాల్ట్‌తో అన్ని దేశాలపైనా ప్రభావం
రుణ పరిమితి డెడ్‌లైన్ ముంచుకొస్తున్నా... బిల్లు ఆమోదం పొందడంలో గందరగోళం నెలకొనడంతో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్.. అమెరికా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయ్చొచ్చనే హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఆ దేశానికి ఉన్న ‘ఏఏఏ’ టాప్ రేటింగ్‌ను నెగటివ్ వాచ్‌లో పెట్టింది. అయితే, ఆఖరి నిమిషంలో పాలక, ప్రతిపక్షాల మధ్య డీల్ కుదరడంతో ఉపశమనం లభించినట్లయింది. రుణ పరిమతి పెంపునకు నేటి అర్ధరాత్రిలోగా ఆమోదం పొందకపోతే అమెరికా ప్రభుత్వం కొన్ని రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రెజరీ విభాగం నిధుల కోసం మరిన్ని బాండ్‌లను జారీచేసేందుకు అవకాశం ఉండదు. దీంతో చెల్లింపులను నిలిపేయడం లేదా వ్యయాల్లో కోతకు దారితీస్తుంది.
ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ చిక్కుల్లోపడటంతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లను కూడా కుదిపేసే ప్రమాదం ఉందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు హెచ్చరించారు. కాగా, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, రుణ బిల్లుల చెల్లింపునకు తగినంత నిధులను సమీకరించగలమన్న విశ్వాసాన్ని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి జే కార్నే వ్యక్తం చేశారు. అయితే, రుణపరిమితి పెంపునకు ఆమోదం పొందినా, పొందకపోయినా తక్షణం డీఫాల్ట్ ముప్పేమీ ఉండబోదని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఏప్రిల్ నాటికి అమెరికా ట్రెజరీ వద్ద 200 బిలియన్ డాలర్ల నిధులు ఉండగా.. ప్రస్తుతం ఇవి 39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంటే తాజా రుణాల సమీకరణ కాస్త ఆలస్యమైనా, చెల్లింపుల్లో డిఫాల్ట్ తక్షణం ఉండదనేది వారి వాదన.
Advertisement
Advertisement