చావుడప్పు వినిపించదా..? | uttam kumar reddy fire on trs govt | Sakshi
Sakshi News home page

చావుడప్పు వినిపించదా..?

Published Fri, Oct 9 2015 2:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

చావుడప్పు వినిపించదా..? - Sakshi

చావుడప్పు వినిపించదా..?

ఖమ్మం రైతు భరోసా యాత్రలో సీఎంపై కాంగ్రెస్ నేతల ధ్వజం
 
ఖమ్మం: రైతుల ఇళ్లల్లో చావు డప్పులు మోగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. నీళ్లు, నిధులు వస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని నమ్మబలికి ఓట్లేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక అన్నదాతలను విస్మరించారని మండిపడింది. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో కాంగ్రెస్ నేతలు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు సీతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కూసుమంచి, కోటపాడుల్లో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 నెలల అసమర్థ పాలన కారణంగానే రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు.  కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ పంటలు పండక, అప్పులు పుట్టక, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వేల కోట్లతో వాటర్‌గ్రిడ్, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెబుతున్న సీఎం.. రైతు రుణాల మాఫీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కొత్త రాష్ట్రంలో సంబరాలు చేసుకోవాల్సిన రైతుల ఇళ్లల్లో చావు డప్పులు మోగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఆసరా పథకం అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయకుంటే ఆందోళనలను ఉధృతం చే స్తామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనా మా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాత్రలో కాంగ్రెస్ నేతలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, పొన్నం ప్రభాకర్, ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కి, బలరాంనాయక్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement