గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’ | ds joined the 'reconstruction' of telengana | Sakshi
Sakshi News home page

గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’

Published Tue, Jul 28 2015 11:13 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’ - Sakshi

గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’

డేట్‌లైన్ హైదరాబాద్
 
తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? పార్టీకి శిరోభారం అవుతారా? అనే దానిపై కేసీఆర్‌కు తన లెక్కలు తనకున్నాయి. వేలం వెర్రిగా చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. మరి కొందరు సీనియర్ నేతలూ తెలంగాణ భవన్ బాట పట్టనున్నారని వార్త. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభిస్తోంది. ఈ మహదవకాశాన్ని అందుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?
 
ధర్మపురి శ్రీనివాస్ ఒకప్పటి రిజర్వు బ్యాంకు ఉద్యోగి. సీనియర్ కాంగ్రెస్ నేత గడ్డం రాజారామ్ ప్రియ శిష్యుడు. క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించక ముందు నుంచే ఆయన నాకు తెలుసు. 1970 దశకం చివర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన అసమ్మతి వర్గం పని చేస్తుండేది. ఆ వర్గానికి నాయకుడైన మంత్రి రాజారామ్ ఇంట్లోనే అసమ్మతి వర్గ సమావేశాలు జరిగేవి. పొలిటికల్ రిపోర్టర్‌లంతా సాయంకాలం కాగానే అక్కడికి చేరే వారు. పత్రికలకు బోలెడంత మేత. వెనుకబడిన తరగతుల బల మైన నాయకుడైన రాజారాం ఇంటికి నేనూ అప్పట్లో కొన్నిసార్ల్లు  అసమ్మతి రాజకీయాల రిపోర్టింగ్ పనిపై వెళ్తుండేవాడిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా ఉన్న శ్రీనివాస్‌తో నాకు అక్కడే పరిచయం. అదీ పలకరింపు లకే పరిమితం. చెన్నారెడ్డి అదృష్టమనండి, అసమ్మతివర్గీయుల దురదృష్టం అనండి భారీగా వర్షం కురుస్తున్న ఓ రాత్రో లేదా తెల్లారుజామునో గానీ రాజారాం కారు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్‌టీ రామారావు తెలంగాణలో పెద్ద ఎత్తున వెనుకబడిన తరగతుల మద్ద తును కూడగట్టుకోగలగడానికి ఒక ముఖ్యకారణం రాజారాం ఆకస్మిక మృతే నని అనుకోవాలి. అయనే ఉంటే వెనుకబడిన తరగతుల వారు పెద్దగా తెలుగుదేశం వెంట వెళ్లేవారు కాదని అప్పట్లో రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ఫిరాయింపులతోనే ‘పునర్నిర్మాణం’
రాజారాం మరణానంతరం శ్రీనివాస్ కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచె లుగా ఎదిగారు. పంచెలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేయడం చాలా మంది రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. పదవుల కోసం కొం దరు, ‘పనుల’ కోసం ఇంకొందరు, నాలుగురాళ్లు వెనకేసుకుందామని మరి కొందరు, ‘న్యాయం’ జరగడం లేదని ఇంకా కొందరు ‘కండువాలు’ మారు స్తుంటారు. పార్టీ విధానాలో, సిద్ధాంతాలో నచ్చక పార్టీలు మారే వాళ్ళు నేడు మచ్చుకు కూడా కనిపించరు. అయితే శ్రీనివాస్ దాదాపు 30 ఏళ్లు కాం గ్రెస్‌లోనే కొనసాగి, మొన్ననే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తాను ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే హక్కు శ్రీనివాస్‌కు లేదా? ఉంది.  కానీ ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కూడా ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేదు, ఆ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తారు. మరి ఎందుకు పార్టీ మారారు? అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ  రాష్ట్ర పునర్నిర్మాణంలో తానూ భాగస్వామిని కావడం కోసమేనని ప్రకటించారు. ఆత్మప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు. శ్రీనివాస్ కాంగ్రెస్‌ను వీడడానికి, టీఆర్‌ఎస్ ఆయనను చేర్చుకోడానికి నిజంగా ఇదే కారణమా? ఇక్కడే మనం శ్రీనివాస్‌నూ, టీఆర్‌ఎస్‌నూ కొన్ని ప్రశ్నలు అడగాలి.

ఒకటి, తెలంగాణ  పునర్నిర్మాణం అంటే ఏమిటి? రెండు, కాంగ్రెస్‌లో కొనసాగుతూనో లేదా కాంగ్రెస్ రాజ కీయాల పట్ల విసుగు చెంది ఉంటే అన్ని పార్టీలకు దూరంగా ఉంటూనో శ్రీనివాస్ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయే వారా? మూడు, తమ పార్టీలో చేరే వారిని తప్ప ఇంకెవరినీ టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకోనివ్వవా? అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే, చివరిదశ పోరాటంలో నిర్వహించిన పాత్ర కారణంగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తే, ఆ పార్టీ, ప్రభుత్వమూ  రాష్ట్ర పునర్నిర్మాణంలో మరెవరు భాగస్వాములు కారాదనేటంత హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నాయా? అయినా తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక్క ఐదేళ్ల కాలంలోనో, ఒక్క రాజకీయ పార్టీతోనో, ఒక్క ప్రభుత్వంతోనో అయ్యేంత చిన్న పని అని అధికార పార్టీ, దానిలోకి వలసపోతున్న నాయ కులు భావిస్తున్నారా? మొత్తం తెలంగాణ సమాజం నడుంబిగిస్తేనే అది సాధ్యం. అందుకూ  చాలా సమయం పడుతుంది.

‘వడ్డించిన విస్తరి’పైనే కినుకా?
 శ్రీనివాస్ పార్టీ మారుతూ పదవుల కోసం తాను కాంగ్రెస్‌ను వీడటం లేద న్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్‌లో తాను అన్ని పదవులనూ చేపట్టాననీ చెప్పారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్తూ కూడా వాస్తవాలను అంగీకరించి నందుకు ఆయన్ను అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. అందులో అందరికీ అన్ని వేళలా, అన్ని అవకాశాలూ రావు. ఏ పదవీ రాకపోయినా కాంగ్రెస్‌నే పట్ట్టుకుని ఉండే విధేయులు కోకొల్లలు. శ్రీనివాస్ ఆ కోవకు చెందిన వారు కారు. కాంగ్రెస్‌లో ఆయన జీవితం వడ్డించిన విస్తరి. శాసన సభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా పని చేశారు. రెండుసార్లు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్ల్లు శాసన సభ ఎన్నికల్లో వరుసగా ఓడినా... సోనియా ఆయనకు శాసన మండలిలో స్థానం కల్పించడమే కాదు, కాంగ్రెస్ పక్ష నేతను చేశారు. అరుదైన అలాంటి ఆదరణ ఆయనకు దక్కింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయనకు అధినేత్రి అపాయింట్‌మెంట్ దొరికే దనేది జగమెరిగిన సత్యం. అటువంటి పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని కష్ట కాలంలో... అదీ అవతల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోతామని తెలిసి కూడా వదిలేసి వెళ్లిన శ్రీనివాస్ వంటి సీనియర్ నేత తరువాతి తరం రాజకీయ నాయకులకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు?

 కాంగ్రెస్‌కు మహదవకాశం
 తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలేసి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? లేక తమ పార్టీకి శిరో భారం అవుతారా? అనేది టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తట్టలేదనుకుంటే అది ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసినట్టే అవుతుంది. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. వేలం వెర్రిగా వెళ్లి చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. శ్రీనివాస్ కాంగ్రెస్ వీడే నాటికి ఆయన ఏ పదవిలోనూ లేరు. ఆయన విషయంలో గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాల్సింది అదే. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, ఇంకో పార్టీలో చేరి, మంత్రి పదవి చేపట్టి కూడా నిస్సిగ్గుగా నా రాజీనామా లేఖ జేబులో ఉంది, మా ఇంట్లో అటక మీద దాచి ఉంచాను అని చెప్పుకు తిరుగుతున్న నాయకుల కంటే ఆయన చాలా నయం. ఇంకా కొం దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ భవన్ బాట పట్టను న్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదొక మంచి అవకాశం. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభి స్తోంది. కాంగ్రెస్ ఈ మహదవకాశాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉందా?

http://img.sakshi.net/images/cms/2015-07/61438106501_Unknown.jpg
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement