
కేంద్రం దూసుకుపోతోంటే కాలయాపనా?: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వకుండా రోజుకో ప్రకటనతో, ‘కొబ్బరికాయ’ సిద్ధాంతాలతో కాలం గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన చేసే పద్ధతి ఇది కాదంటూ నిత్యం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న బాబు.. అసలు తెలంగాణకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. విభజన విషయంలో కాంగ్రెస్ తప్పుడు వైఖరి, విధానంతో ముందుకు వెళుతోందని నిజంగానే భావిస్తే బాబు కచ్చితంగా ఆ లేఖను వెనక్కి తీసుకునేవారని లక్ష్మణరెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌కు ఇష్టంలేని పని చేయకూడదనే ఉద్దేశంతోనే లేఖను వెనక్కి తీసుకోకుండా మిన్నకుంటున్నార నే అనుమానం కలుగుతోంద ని గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు.
అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరలేదు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం చేసినప్పుడు కూడా వ్యతిరేకించకుండా సీమాంధ్ర రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలంటూ ఆ తీర్మానాన్ని సమర్థించారు. ఇప్పటికీ అదే వైఖరితో ఉంటే జీవోఎం ముందు హాజరై తన ప్రతిపాదనలేంటో చెప్పేవారే. కానీ అలా చేయలేదు. రాష్ట్రపతికి ఉత్తరం రాసి మీ పద్ధతి బాగా లేదంటారు. తాజాగా విభజన అంటే కొబ్బరికాయ కొడితే సమంగా సగానికి పగిలినట్టుగా జరగాలన్నదే తన ఉద్దేశమంటారు. ఇంతా చేస్తే ఆయన అసలు ఉద్దేశమేంటో మాత్రం అర్థం కావడం లేదు..’ అని లక్ష్మణరెడ్డి విమర్శించారు. తన కుమారుడిని ఎలా ప్రోజెక్టు చేసుకోవాలా? అన్నది తేల్చుకోలేకే చంద్రబాబు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోందని ఆయన అన్నారు. ఒకపక్క కేంద్రంలో అంతా జరిగిపోతుంటే మళ్లీ ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్ర ప్రజల ముందుకు వెళతానని చంద్రబాబు చెబుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సీమాంధ్రకు అన్యాయం చేసిన విషయం స్పష్టంగా తెలిసిపోతోందని, ఈ కారణంగానే అక్కడి ప్రజల్లోఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పారు. కొందరు పార్టీ కేడర్‌ను ముందుపెట్టుకుని యాత్రలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇప్పుడు సమన్యాయం అంటూ కొత్త వాదన తేవడంతో బాబు మరింత చులకనయ్యారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేదనే విషయం రాష్ట్రానికే కాదు.. దేశమంతా తెలిసిపోయిందని చెప్పారు. వారానికోసారి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాయడం మినహా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విషయంలోగానీ, విభజించాలన్న విషయంలోగానీ ఏదీ తేల్చకుండా నాన్చుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క చంద్రబాబేనని లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు.