
మీరిలా చేస్తారనుకోలేదు..
కార్గిల్ చొరబాటుపై షరీఫ్‌తో దిలీప్‌కుమార్
* షరీఫ్‌ను దిలీప్‌తో మాట్లాడించిన వాజ్‌పేయి
* పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకంలో వెల్లడి
లాహోర్: కార్గిల్ యుద్ధ సమయంలో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. శాంతి సాధన కోసం బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ను రంగంలోకి దించినట్లు తెలిసింది. ఆనాడు కూడా పాక్ ప్రధానిగా ఉన్న నేటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను వాజ్‌పేయి దిలీప్‌తో మాట్లాడించారు.
పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి తన తాజా పుస్తకం ‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’ పుస్తకంలో ఈ సంగతులు బయటపెట్టారు. ఆనాడు షరీఫ్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సయీద్ మెహదీని ఉటంకిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. సయీద్ తెలిపిన వివరాల ప్రకారం.. 1999 మే నాటి ఆ యుద్ధ సమయంలో సయీద్, షరీఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు వాజ్‌పేయి నుంచి షరీఫ్‌ఉ అత్యవసరంగా ఫోన్ వచ్చింది.
‘నాకు లాహోర్‌లో సాదర స్వాగతం పలికి, ఆ వెంటనే కార్గిల్‌ను ఆక్రమించుకుని మీరు నన్ను కించపరచార‘ని వాజ్‌పేయి షరీఫ్‌తో అన్నారు. తనకేమీ తెలియదని ఆర్మీ చీఫ్ ముషార్రఫ్‌తో మాట్లాడాక మళ్లీ మాట్లాడతానని షరీఫ్ అన్నారు. సంభాషణ ముగుస్తుండగా.. తన పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో మాట్లాడాలని వాజ్‌పేయి షరీఫ్‌కు చెప్పారు. తర్వాత ఫోన్‌లో దిలీప్ కుమార్ గొంతు వినపడ్డంతో షరీఫ్ ఆశ్చర్యపోయారు.
దిలీప్ మాట్లాడుతూ.. ‘మియా సాబ్.. పాక్-భారత్‌ల మధ్య శాంతికి పాటుపడతానని చెప్పుకునే మీ నుంచి ఇలాంటి పరిణామాన్ని ఊహించలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తితే భారతీయ ముస్లింలు ఎంతో అభద్రతా భావానికి గురవుతారని, ఇళ్లనుంచి బయటకు కూడా వెళ్లరని ఒక భారతీయ ముస్లింగా మీకు చెబుతున్నాను. పరిస్థితిని నియంత్రించడానికి దయచేసి ఏదో ఒకటి చేయండి’ అని అన్నారు. పాక్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్(అసలు పేరు యూసఫ్ ఖాన్)కు పాక్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన నిషానే ఇంతియాజ్ అవార్డు వచ్చింది.