
మరో బాంబు పేల్చిన రాంగోపాల్ వర్మ!
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగాబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆయన తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ తేల్చేశారు. ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేసిన నాగాబాబు అంతే ఘాటుగా వర్మ విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. నాగబాబు సార్‌కి ఇంగ్లిష్ అర్థం కాదని, కాబట్టి ఎడ్యుకేట్ అయిన స్నేహితుడి ద్వారా తన ఇంగ్లిష్ ట్వీట్ల గురించి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. గ్రేట్ మెగాబ్రదర్ ముందు నాగబాబు 0.01శాతం మాత్రమేనని, అందుకే నాగాబాబులా చిరంజీవి అరవలేదని ఘాటుగా చురకలంటించారు. 'నాకు సలహాలు ఇచ్చేముందు నాగాబాబు తన జబర్దస్త్ కెరీర్ ఏమిటో ప్రశ్నించుకోవాలి' అని అన్నారు. నాగబాబు సార్.. ఖైదీ 150 ట్రైలర్ ఇప్పుడే చూశాను. అద్భు..........తంగా ఉంది. అవతార్ కంటే కూడా బాగుంది' అంటూ వ్యాఖ్యానించారు.
అంతకుముందు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. అయితే, ఈ ట్వీట్లను హ్యాక్ చేసి పెట్టినవేనని వర్మ ట్విస్టు ఇచ్చారు. అంతకుముందు ఆయన చేసిన ట్వీట్ల సారాంశమిది. 'నాగబాబు గారూ, మీరు ట్విట్టర్‌లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అని వర్మ ముగించారు.