అయోధ్యకు ఇటుకలు తరలిస్తున్న వీహెచ్‌పీ
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఓ అడుగు ముందుకేసింది. రెండు ట్రక్కుల ఇటుకలు ఆదివారం అయోధ్యలోని రామ్ సేవక్ పురం చేరుకున్నాయి. ఇటుకలకు రాం జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ పూజలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం నుంచి మందిర నిర్మాణానికి సంకేతాలు వచ్చినందునే పనులు మొదలుపెట్టామని.. వీహెచ్‌పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ఇకపై విడతల వారిగా ఇటుకలు అయోధ్యకు వస్తాయన్నారు. మందిర నిర్మాణ పరిణామాలను గమనిస్తున్నామని, మత సామరస్యానికి భంగం వాటిల్లుతుందనిపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
మందిర వివాదాలను కోర్టు బయట పరిష్కరించేందుకు సమాజ్‌వాద్ పార్టీ నేత ములాయం సింగ్ చొరవతీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమాభారతి కోరారు. శాంతియుత పరిష్కారం కోసం 2010 నుంచి తనవంతు ప్రయత్నం చేస్తున్న అలహాబాద్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి పాలోక్ బసు.. ఈ మధ్య ఇరువర్గాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.