విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాట రాజకీయాలు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠరేపుతున్న తరుణంలో ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలో అడుగుపెట్టారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం ఎదురెళ్లి మరీ విద్యాసాగర్‌కు సాదర స్వాగతం తెలిపారు. ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ-పన్నీర్ సెల్వాం నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ సంక్షోభంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ నిర్ణయం ఏమిటా.. అని తమిళనాడే కాదు యావత్ దేశం ఎదురుచూస్తున్నది. ఇలాంటి తరుణంలో రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన గవర్నర్ మరికాసేపట్లో డీజీపీ, సీఎస్‌లను కలువబోతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. ఇప్పటికే మొదట ఓపీఎస్‌కు, ఆ తర్వాత శశికళకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తరుణంలో గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) గవర్నర్ దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.