
భువీపై కోహ్లి 'స్పెషల్' వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో తన బ్యాటింగ్ సత్తా ఏమిటో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి చాటాడు. 107 బంతుల్లో 92 పరుగులు చేసిన కోహ్లి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తృటిలో సెంచరీ మిస్ అయిన కోహ్లిని 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. బౌలర్లు రెగ్యులర్‌గా వికెట్లు పడగొట్టడం వల్లే రెండో వన్డేలో భారత్ సునాయసంగా విజయం సాధించిందన్నాడు.
'ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేం అంత గొప్ప స్కోరును చేయలేదు. కానీ బౌలింగ్‌లో శుభారంభాన్ని పొందింతే ఈ స్కోరును నిలబెట్టుకోవచ్చునని అనుకున్నాం. ఇందుకు రెగ్యులర్‌గా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఆరంభంలోనే భువీ ఈమేరకు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం బుమ్రా కూడా రాణించాడు. ఇక స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థికి కావాల్సినంత నష్టాన్ని చేకూర్చారు. మేం వికెట్లు పడగొట్టి ఉండకుంటే.. ఈ వెట్ వికెట్‌లో స్కోరును నిలబెట్టుకోవడం కష్టంగా మారేది' అని కోహ్లి వివరించాడు. ఈ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని, అయినా, ఈ మ్యాచ్‌లో ఫలితం ఆనందం కలిగించిందని చెప్పాడు.
ఫస్ట్ స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ గురించి కెప్టెన్ కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్, హిల్టన్ కార్ట్‌రిట్ వికెట్లను భువీ పడగొట్టడం ఆసీస్‌ను గట్టి దెబ్బతీసింది. ఈ విషయాన్ని కోహ్లి ప్రస్తావిస్తూ.. 'భువీ స్పెల్ మ్యాచ్‌లో ఎంతో కీలకంగా నిలిచింది. మిడిల్ ఓవర్లలో మణికట్టు స్పిన్నర్లు డ్యామేజ్ చేస్తారని తెలుసు. కానీ తొలి పది ఓవర్లలో ఆస్ట్రేలియన్లు పరుగులు రాబట్టాలని చూశారు. మేం కొన్ని వికెట్లు తీయాలని చూశాం. భువీకి రెండు వికెట్లు దక్కాయి. మరో వికెట్ కూడా దక్కి ఉండేది. తన బౌలింగ్‌తో మ్యాచ్‌గతిని భువీ నిర్దేశించాడు. అద్భుతమైన బంతులతో అతను బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశాడు. పిచ్ నుంచి కొంచెం సహకారం లభిస్తే..భువీ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని నిరూపించుకున్నాడు' అని కోహ్లి అన్నాడు. ఇక స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ బౌలింగ్‌ను కూడా కోహ్లి ప్రత్యేకంగా ప్రశంసించాడు. 2019 వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఇద్దరు బౌలర్లు పోటాపోటీగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడాడు.