తొలి వన్డేలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు డీఆర్‌ఎస్ రివ్యూను కోల్పోయినప్పుడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి స్టీవ్ స్మిత్‌ని ఒకింత విచిత్రంగా ఎద్దేవా చేశాడు. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో తడబడ్డ సంగతి తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను హర్థిక్ పాండ్యా, మహేంద్రసింగ్ ధోనీ తమ విలువైన భాగస్వామ్యంతో గట్టెక్కించారు. 66 బంతుల్లో 83 పరుగులు చేసి చెలరేగి ఆడిన పాండ్యా ఔటైన తర్వాత భువనేశ్వర్ క్రీజ్‌లోకి వచ్చాడు. 45వ ఓవర్‌లో బౌలర్ మార్కస్ స్టోయినిస్ భువీ ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ ఈ అప్పీల్‌ను తిరస్కరించడంతో అతను ఏకంగా డీఆర్‌ఎస్ రివ్యూ (టీవీ రిప్లే) కోరాడు.
టీవీ రిప్లేలో స్పష్టంగా బంతి బ్యాటుకు తగిలనట్టు తేలింది. అసలు బంతిని భువీ ప్యాడ్స్‌ను తాకని విషయం స్పష్టమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు రివ్యూ అవకాశాన్ని కోల్పోయింది. నిరాశతో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ముఖం పాలిపోగా.. ఈ సమయంలో కోహ్లి భుజాలను కదిలిస్తూ.. ఔటైనట్టు వేలిని చూపిస్తూ ఒకింత విచిత్రంగా స్మిత్‌ను ఎగతాళి చేశాడు. టీవీలో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో దృశ్యాన్ని క్యాపర్ చేసిన ఓ నెటిజన్ దీనిని ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కోహ్లి విచిత్రమైన ఎగతాళిపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.
- రివ్యూ కోల్పోగానే స్మిత్‌ను ఎద్దేవా చేసిన కోహ్లి