ఆ పార్టీకి తప్ప ఎవరికైనా ఓటేయండి
లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో ఆయన తొలి ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ తన స్నేహితుల రుణాలను రద్దు చేసి వారికి సాయపడ్డారని కేజ్రీవాల్ విమర్శించారు. అంతేగాక నల్లధనం సర్దుకోవడానికి ప్రధాని వారికి అవకాశమిచ్చారని ఆరోపించారు. ‘ఉత్తరప్రదేశ్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు. ఇక్కడ 80 లోక్‌సభ స్థానాలకు 73 బీజేపీకి ఇచ్చారు. నేను ఓట్లు అడగటానికి ఇక్కడికి రాలేదు. ఓట్ల కోసం అయితే మా పార్టీ పోటీ చేస్తున్న పంజాబ్ లేదా గోవాకు వెళ్లేవాడ్ని. దేశాన్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాను.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు నాపై కేసులు పెడుతున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయేందుకు మోదీ సాయపడ్డారు. మాల్యా బకాయిపడ్డ బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని మోదీ తన స్నేహితులకు ముందే చెప్పారు. దీంతో వాళ్లు నల్లధనాన్ని సర్దుకునేందుకు అవకాశం కల్పించారు. సామాన్యులు మాత్రం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల మందు క్యూలో గంటల కొద్దీ నిల్చున్నా నగదు దొరకడం లేదు. మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి. బీజేపీకి మాత్రం వేయకండి’ అని కేజ్రీవాల్ అన్నారు.