
38 లక్షల నవ ఓటర్లు: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన 38 లక్షల మంది యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా నవంబర్ 15 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటికే అర్హత ఉన్న 22 లక్షల మంది యువతీ యువకులను, 2014 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే 16 లక్షల మందిని ఓటర్ల జాబితాలోకి తేవాల్సి ఉందన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలతో పాటు అందరూ సహకరించాలన్నారు. యుక్త వయస్కులందరూ తప్పనిసరిగా ఓటర్‌గా పేరు నమోదు చేయించుకోవాలన్నారు. విద్యా సంస్థలు ఇ-రిజస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించాలన్నారు. శనివారం సచివాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన తర్వాత భన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు సవరించే ఓటర్ల జాబితా ప్రకారమే 2014 ఏప్రిల్-మే మధ్యలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్, లెట్స్ ఓట్ సంస్థలు తోడ్పడనున్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను 66,964 నుంచి 69,033కు పెంచామన్నారు.
వచ్చే ఎన్నికల్లో ‘నో ఓటు’కు అవకాశం
ఈసీ నిర్ణయం మేరకు వచ్చే ఎన్నికల్లో ‘నో ఓటు’కు అవకాశం కల్పిస్తున్నట్టు భన్వర్‌లాల్ తెలిపారు. అయితే, ‘నో ఓటు’కే ఎక్కువ మంది ఓటేసినా, మిగతా అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వారే గెలిచినట్టు ప్రకటిస్తామన్నారు. మంచి అభ్యర్థులను నిలబెట్టాలని, ఏ అభ్యర్థీ నచ్చని పరిస్థితి ఓటర్లకు కల్పించకూడదని రాజకీయ పార్టీలకు ఆయన హితవు పలికారు.
కాలేజీల్లో చేరేనాటికే ఓటరు కార్డు: పార్టీలు
18 ఏళ్లు నిండిన విద్యార్థులు కాలేజీల్లో చేరే నాటికే ఓటరు కార్డులు కలిగి ఉండేలా నియమం పెట్టాలని పలు పార్టీల ప్రతినిధులు సూచించారు. దాసోజు శ్రవణ్ (టీఆర్‌ఎస్), వైవీ రావు (సీపీఎం), కె.లక్ష్మణ్ (బీజేపీ), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్
ముసాయిదా జాబితా ప్రకటన : 15-11-2013
దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ: 15 నుంచి 30 వరకు
గ్రామసభ, స్థానిక సంస్థల్లో జాబితాలో
పేర్లు చదివి వినిపించడం : 19వ తేదీ, 26వ తేదీ
బూత్‌ల వారీగా బూత్‌స్థాయి ఆఫీసర్లు సమావేశం- పార్టీల ఏజెంట్ల నుంచి
దరఖాస్తులు స్వీకరణ : 17వ తేదీ, 24వ తేదీ
ఓటర్ నమోదు, అభ్యంతరాల దరఖాస్తుల పరిష్కారం: 16వ తేదీ
వివరాలు అప్‌డేట్, సప్లమెంటరీ జాబితా తయారు: 10-01-2014 దాకా
ఓటర్ల తుది జాబితా ప్రకటన: 16-01-2014