
టీ బిల్లు పెట్టలేదు
*బీజేపీ, వైఎస్సార్‌సీపీ సహా ఎనిమిది పార్టీలదీ అదే మాట
*సుష్మాస్వరాజ్ నేతృత్వంలో స్పీకర్‌తో భేటీ
*బిల్లు సభలో పెట్టామన్న వాదనను అంగీకరించడం లేదు
*బృందంలో జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి తదితరులు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును గురువారం అసలు లోక్‌సభలో ప్రవేశపెట్టినట్టా, లేదా అన్నది వివాదాస్పదంగా మారింది. బిల్లు పెట్టినట్టుగా తాము పరిగణించే ప్రసక్తే లేదని ప్రధాన ప్రతిపక్షం సహా ఎనిమిది విపక్షపార్టీలు స్పీకర్‌కు తేల్చిచెప్పాయి. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, జేడీ(యూ), సీపీఐ, ఏఐఏడీఎంకే తదితర పార్టీలు గురువారం సభ వాయిదా అనంతరం ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ నేతృత్వంలో స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి ఈ విషయమై తీవ్ర నిరసన, అభ్యంతరం తెలిపాయి. బిల్లును సభలో పెట్టామన్న ప్రభుత్వ వాదనను అంగీకరించడం లేదని స్పష్టం చేశాయి. అసలు బిల్లును ఎక్కడ, ఎలా, ఏ పద్దతిన ప్రవేశపెట్టారో వివరించాలని నిలదీశాయి.
బృందంలో బీజేపీ అగ్రనేత అద్వానీ, శరద్ యాదవ్ (జేడీ-యూ), గురుదాస్ దాస్‌గుప్తా (సీపీఐ), శైలేంద్రకుమార్ (ఎస్పీ), భరృ్తహరి మెహతాబ్ (బీజేడీ)లతో పాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, తంబి దొరై (ఏఐఏడీఎంకే) కూడా ఉన్నారు. అనుబంధ ఎజెండాలో లేకుండా, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక రాష్ట్రాన్ని విభజించే కీలకమైన అంశానికి సంబంధించిన బిల్లును ఆషామాషీగా సభ నియంత్రణలో లేనప్పుడు ప్రవేశపెట్టకుండానే ప్రవేశపెట్టినట్టు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని చెబుతున్న యూపీఏ
ప్రభుత్వం.. ఆ తర్వాత, అంటే మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులకు పంచిపెట్టిన అజెండా సర్క్యులర్ ఇది! ‘బిల్లును సభలో
ప్రవేశపెట్టడం జరుగుతుంది’ అని అందులో పేర్కొనడం విశేషం.
‘సాధారణ ఎజెండాలో, అనుబంధ ఎజెండాలో కూడా పేర్కొనకుండానే 12 గంటల సమయంలో బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో దిద్దుబాటు చర్యగా అఘమేఘాల మీద మూడో అనుబంధ ఎజెండాను వెలువరించారు. తప్పును సరిపుచ్చుకోవడానికా అన్నట్టు, 2 గంటల సమయంలో సభ్యులకు పంపిణీ చేసిన అనుబంధ ఎజెండాలో ‘‘ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది’’ అని వెల్లడించడమేమిటి?’ అని మొత్తం ప్రక్రియనే తప్పుబట్టారు.
సభ అదుపులో లేనప్పుడు క్షణాల్లో ఏదో చదివామనిపించడం ఏమిటని ప్రశ్నించారు. సంప్రదాయ పద్దతిలో బిల్లు ప్రవేశపెట్టాలన్నప్పుడు, కనీస పద్ధతయిన కొందరు అవుననటం, కొందరు కాదనటం కూడా జరగలేదని, ఎవరూ చేతులెత్తలేదనీ చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న హోంమంత్రి షిండే, మంత్రి కమల్‌నాథ్ అంతా సజావుగానే జరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఇది సరికాదని, మంత్రులు తమ అభిప్రాయాన్ని ప్రతినిధి బృందంపై రుద్దే యత్నం చేస్తున్నారని నిరసిస్తూ వారు వాకౌట్ చేశారు.