
6 నిమిషాల్లో 60 సార్లు అడ్డుకున్నారు!
మాజీ స్పీకర్ మీరాకుమార్‌పై సుష్మ
న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌పై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విరుచుకుపడ్డారు. 2013 ఏప్రిల్‌లో లోక్‌సభ సమావేశాల సందర్భంగా మీరాకుమార్ వ్యవహరించిన తీరుపై ఓ వీడియోను సామాజిక మాధ్య మంలో పోస్టుచేశారు. సమావేశాల సంద ర్భంగా అప్పటి మన్మోహన్ ప్రభుత్వాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద స్కాంల ప్రభుత్వమని సుష్మ విమర్శి స్తుండడం, మంత్రులు పదే పదే ఆమె ప్రసంగానికి అడ్డుపడుతుండడం, స్పీకర్ మీరా కుమార్ థాంక్యూ, ఆల్‌రైట్ అంటూ ఆమె ప్రసంగాన్ని ఆపేసేలా ప్రయత్నించడం ఆ వీడియోలో ఉన్నాయి.
దాంతోపాటు ఓ దినపత్రికలో ప్రచురితమైన ‘స్పీకర్ 6 నిమిషాల్లో 60 సార్లు సుష్మా ప్రసంగాన్ని అడ్డుకున్నారు’ అనే హెడ్‌లైన్ ఉన్న పేపర్ క్లిప్‌ను ఆ వీడియోకు లింకు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తటస్థవ్యక్తి అంటూ విపక్షాలు మీరాకుమార్‌ను ప్రచారం చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు.
అంతరాత్మ సాక్షిగా: మీరా కుమార్
రాష్ట్రపతి ఎన్నికల్లో అంతరాత్మను అనుసరించి ఓటేయాలని విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ చట్టసభల సభ్యులను కోరారు. ఏదైనా చట్టాన్ని తీసుకురావడంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం అని రాజ్యాంగం చెబుతోందనీ, ఆ పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదని ఆమె అన్నారు.