సమైక్యంగా ఉంచాలనే హక్కు మాకూ ఉంది: ఉండవల్లి అరుణ్కుమార్
ప్రత్యేక తెలంగాణ కోరుకునే హక్కు వాళ్లకు ఎంత ఉంటుందో, సమైక్యంగా ఉంచాలనే హక్కు అవతలివాళ్లకి కూడా ఉంటుందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు కాంగ్రెస్ వార్ రూంలో ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కార్యాయలంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీతో ఏం చెప్పాలన్న విషయమై వారు తీవ్రంగా చర్చించుకున్నారు. అసలు.. ఈ సమావేశాల్లోనే కాదు, ఏ పార్లమెంటు సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు వస్తుందా లేదా అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందుకే తామిక్కడ ఉన్నాం తప్ప.. ఆందోళనలకు భయపడి సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లడంలేదన్నది సరికాదని ఆయన అన్నారు.
ఇక ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం కూడా ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా కొంతమంది నాయకుల ప్రవర్తన గర్హనీయమని, దీన్ని వెంటనే ఆపాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే హక్కు వారికి ఎలా ఉందో, సమైక్యంగా ఉండాలని కోరుకునే హక్కు అవతలివాళ్లకు కూడా అంతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దాన్ని రౌడీయిజంతోనో, దాదాగిరితోనో ఆపాలనుకుంటే కుదరదని తెలిపారు. ఈ విషయాన్ని ఆంటోనీ కమిటీకి తెలిపామని, వెంటనే సంబంధితులందరికీ దీన్ని తెలియజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని.. దానికి కమిటీ కూడా సానుకూలంగా స్పందించిందని అరుణ్కుమార్ అన్నారు.
రాజధాని నగరంలో ఏ విధమైన శాంతియుత ప్రదర్శన జరిగినా దాని మీదకు వెళ్లే అధికారం ఎవరికీ లేదని, ఉంటే గింటే ప్రభుత్వానికే ఉంటుందని ఆయన చెప్పారు. విద్యుత్ సౌధ, జలసౌధతో పాటు ఏపీ ఎన్జీవో కార్యాలయంలో లాయర్ల సమావేశంలో జరిగిన గొడవను కూడా ఆంటోనీ కమిటీ దృష్టికి సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లారు. సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలా లేదా అనే హక్కు కేవలం ప్రభుత్వానికే ఉంటుందని, అడ్డుకోవాలంటే పోలీసులు అడ్డుకోవాలి తప్ప వ్యక్తులు, పార్టీలు వాటిని అడ్డుకోవాలని చూడటం సరికాదని ఉండవల్లి అన్నారు. దౌర్జన్యం చేయాలనుకుంటే దాని దుష్ఫలితాలు వారే అనుభవిస్తారని చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత గురించి ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, మీ అందరి (మీడియా) దయవల్ల అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుస్తోందని ఆయన అన్నారు. ఇంత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం తాను పుట్టాక భారతదేశంలో ఇంతవరకు ఎన్నడూ లేదని, ఇకముందు కూడా జరుగుతుందన్న నమ్మకం లేదని ఆయన చెప్పారు.
ఆంటోనీ కమిటీతో చెప్పాల్సిందంతా చెప్పామని, తొందర్లోనే మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు మళ్లీ ఓసారి కమిటీతో సమావేశమై, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిస్థితులు వివరిస్తామని అన్నారు. ఈరోజే సమగ్రంగా చెబుదామనుకున్నా, ఆహారభద్రత బిల్లుపై లోక్సభలో ఓటింగ్ ఉండటం వల్ల ఈరోజు కుదరలేదని ఆయన చెప్పారు.