పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో తొలిరోజే తేలిపోయింది. సమైక్య నినాదాలు మిన్నంటడం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు పదేపదే వెల్లోకి దూసుకెళ్లి కార్యకలాపాలకు అడ్డు తగలడంతో పార్లమెంటు ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, విభజన తగదని సీమాంధ్ర ఎంపీలు ఒకవైపు నినదించగా, మరోవైపు బోడోలాండ్ సహా పలు కొత్త రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమ వాణిని గట్టిగా వినిపించడంతో సభా కార్యకలాపాలకు పదే పదే ఆటంకం కలిగింది.
రాష్ట్ర విభజన సెగ పార్లమెంట్‌లో పెను ప్రకంపనలు రేపుతోంది. వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో తేడా కనిపించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెనక్కు వెళ్లాలని సోనియా వేలు చూపి మరీ ఆదేశించినా వారు పట్టించుకోలేదు.
మరోవైపు బోడోల్యాండ్ ప్రాంత ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రం కొనసాగింది. ఐతే సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్ సభను తర్వత మధ్యాహ్నం 2 గంటలకు, మళ్లీ 3 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇవే పరిస్థితి కనిపించింది.
సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడకు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్లకార్డులను కొందరు ఎంపీలు ప్రదర్శించారు. ఓ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల వద్దకు టీడీపీ సభ్యుడు ఎన్. శివప్రసాద్ ఆగ్రహంగా వెళ్లబోగా.. సహచరులు ఆయనను వారించారు. సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ప్రయత్నించినా, ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. రాజ్యసభలో టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్ సభలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని టీడీపీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చినప్పుడు బోడోలాండ్ ఎందుకు ఇవ్వరని ఆ ప్రాంత సభ్యుడు బిశ్వజిత్ దైమరి ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు.
ఎన్నిసార్లు సమావేశమైనప్పటికీ పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడం, సభా కార్యకలాపాలు జరిగేలా లేకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే, అంతకుముందు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విధివిధానాలపై కేబినెట్ నోట్ రూపొందుతోందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఒకవైపు సీమాంధ్రలో ఆందోళనలు జోరుగా సాగుతున్నా.. కేంద్రం ఈ ప్రకటన చేయడంతో ఎంపీలతో పాటు అటు ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నవారు కూడా రగిలిపోయారు.
మరోవైపు.. రక్షణమంత్రి ఏకే ఆంటోనీతో సీమాంధ్ర మంత్రులు ఈ రోజు భేటీ కానున్నారు. సీమాంధ్రలో ఆందళోనలపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.