విడాకులకు కారణం అక్కర్లేదు: హైకోర్టు
భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని అనుకుంటే.. కోర్టు అందుకు కారణాలు వెతకాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిజనిర్ధారణ కోసం పట్టుబట్టనక్కర్లేదని జస్టిస్ కేకే శశిధరన్, జస్టిస్ ఎన్.గోకుల్‌దాస్‌లతో కూడిన డివిజన్ బెంచి తెలిపింది. వివాహబంధం విఫలమైనప్పుడు దాన్ని తెంచుకోవాలని ఇద్దరూ భావిస్తే, కోర్టు కూడా వాళ్ల సెంటిమెంట్లను గౌరవించి విడాకులు మంజూరు చేయాలని, అందుకు కారణాలు వెతుకుతూ విడాకులు నిరాకరించడం సరికాదని న్యాయమూర్తులు చెప్పారు. దాదాపు ఏడాదికి పైగా వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు సంయుక్తంగా దాఖలుచేసిన విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ తిరునల్వేలి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. కలిసి జీవించడం సాధ్యం కాదని వాళ్లు నిర్ణయించుకున్న తర్వాత.. విడాకులు తీసుకోవాలని వాళ్లు భావిస్తే అవి మంజూరు చేయడమే నయమని చెప్పింది.
ఈ కేసులో యువతీ యువకులు 2013 మేలో పెళ్లి చేసుకున్నారు. కానీ, 2014 జూలై నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2015లో ఇద్దరూ కలిసి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే విడిపోవడానికి కారణాలు చెప్పలేదంటూ ఫ్యామిలీకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దానిపై వాళ్లు మద్రాసు హైకోర్టుకు వెళ్లగా కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ఏడాది ముందునుంచి వాళ్లు విడిగానే ఉంటున్నారు కాబట్టి ఇక కలిసి జీవించే అవకాశం లేదని, ఇక వాళ్లకు విడాకులు మంజూరు చేయడం తప్ప కోర్టుకు కూడా వేరే అవకాశం లేదని న్యాయమూర్తులు తెలిపారు.