
10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని టి.జేఏసీ కన్వీనర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని రెండు జిల్లాలను విడగొడితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టి.జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, రాయల తెలంగాణ అంశంపై చర్చించింది.
ఆ కమిటీ భేటీ అనంతరం కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తమకు 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జిల్లా ఎక్కువా వద్దు, ఒక జిల్లా తక్కువా వద్దని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ... రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు టీజేఏసీ నేత కోదండరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు.