బలహీనంగా ప్రపంచ ఎకానమీ: ఐఎంఎఫ్
దుర్బల దేశాల రక్షణకు కొత్త విధానాలు అవసరం
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా దుర్బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. అత్యంత దుర్బలంగా ఉన్న దేశాలను రక్షించేందుకు కొత్త విధానాలను రూపొందించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఒక నివేదికలో పేర్కొంది. షాంఘైలో త్వరలో జీ20 కూటమి దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని జీ20 సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచ వృద్ధి మందగించిందని, మార్కెట్లలో సంక్షోభాలు.. చమురు ధరల పతనం.. రాజకీయభౌగోళిక వివాదాలతో వృద్ధి పట్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాలు పెరుగుతుండటం, ఆస్తుల ధరలు పడిపోతుండటం తదితర పరిణామాలతో ప్రపంచ ఎకానమీ రికవరీ మరింత బలహీనపడిందని ఐఎంఎఫ్ తెలిపింది. రిస్కులను కట్టడి చేయడానికి, ప్రపంచ ఎకానమీని వృద్ధి బాట పట్టించడానికి జాతీయ స్థాయిలోను, బహుళపక్ష స్థాయిలోను పటిష్టమైన విధానాలు అవసరమని పేర్కొంది. 2015 ఆఖరు నాటికి అంతర్జాతీయంగా కార్యకలాపాలు అనూహ్యంగా మందగించాయని, ఈ ఏడాది ప్రారంభంలో పరిస్థితి మరింత దిగజారిందని వివరించింది. వృద్ధికి పొంచి ఉన్న ముప్పులను ఎలా ఎదుర్కొనాలన్నదే షాంఘై చర్చల్లో ప్రధానాంశం కాగలదని పేర్కొంది.
ఉదార ఆర్థిక విధానాలు కావాలి ...
డిమాండ్‌ను పెంచేందుకు ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయక ప్యాకేజీలివ్వడంతో పాటు సంస్కరణలను అమలు చేయాలని ఐఎంఎఫ్ సూచించింది. కఠిన ఆర్థిక విధానాల వల్ల వృద్ధి గతి మందగించకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉదార ద్రవ్య విధానాలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ద్రవ్యపరపతి విధానంపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదని, సమీప భవిష్యత్‌లో ద్రవ్య విధానాలు పెట్టుబడులకు ఊతమిస్తూ.. రికవరీకి తోడ్పడేలా ఉండాలని ఐఎంఎఫ్ వివరించింది.