రాజ్యసభలో నాటకీయంగా ఆమోదం | What happened in the Rajya Sabha? | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో నాటకీయంగా ఆమోదం

Published Thu, Feb 20 2014 9:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

రాజ్యసభలో నాటకీయంగా ఆమోదం

రాజ్యసభలో నాటకీయంగా ఆమోదం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఈ రోజు రాజ్యసభలో నాటకీయంగా ఆమోదించారు. లోక్సభలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించడంతో కాంగ్రెస్తోపాటు బిజెపి కూడా  పలు విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల బిల్లుకు కొన్ని సవరణలు చేసి, సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇచ్చి, ఓటింగ్ పెట్టమన్నా పెట్టకుండా మూజువాణి ఓటుతో తంతును నాటకీయంగా ముగించారు.  బిల్లుకు సంబంధించి ఉదయం నుంచి పలు పార్టీలకు చెందిన  సభ్యుల నిరసనలు - నినాదాలు - అరుపులు -కేకలు - గందరగోళం - ఘర్షణలు.... మధ్యలోనే రాజ్యసభ జరిగింది. ఆ గందరగోళ పరిస్థితులలోనే సభ వాయిదాలుపై వాయిదాలు పడుతూ  బిల్లు ప్రవేశం - బిల్లుకు వ్యతిరేకంగా సభ్యుల నోటీసులు ఇవ్వడం - వాటిని డిప్యూటీ చైర్మన్ కురియన్ చదవడం - కేంద్ర హొం మంత్రి బిల్లును చదివడం - చర్చ - ప్రధాని ప్రకటన - చర్చ ముగింపు - బిల్లు ఆమోదం.. అన్నీ జరిగిపోయాయి.

రాజ్యసభలో ఏం జరిగిందంటే...

*  గందరగోళం మధ్యలో తెలంగాణ బిల్లు సభకు వచ్చిందని డిప్యూటీ చైర్మన్  కురియన్ సభలో ప్రకటించారు.
* బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని, బిల్లుకు రాజ్యాంగ బద్దతలేదని - బిల్లును తిరస్కరించాలని ....పలువురు సభ్యులు నోటీస్లు ఇచ్చారు.
* సభ్యులు ఇచ్చిన నోటీసులను డిప్యూటీ స్పీకర్ చదివి వినిపించారు.
సభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ ఇచ్చిన నోటీస్ను డిప్యూటీ చైర్మన్ కురియన్ తప్పుగా చదివి, ఆ తరువాత సవరించుకున్నారు.
* పలువురు సభ్యులు నిరసన-అరుపులు-కేకల మధ్యలోనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు డిప్యూటీ చైర్మన్  అనుమతి ఇచ్చారు. .
* బిల్లుకు రాజ్యాంగబద్దతలేదని సభ్యులు నినాదాలు చేస్తుండగా -  గందరగోళం మధ్యలోనే షిండే బిల్లును చదివేశారు.
* సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు.
* విభజనపై టిడిపి సభ్యులు రెండుగా చీలి అనుకూల - వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శంచారు.
* తెలంగాణ బిల్లుకు అనుకూలంగా  గుండు సుధారాణి,  అక్రమ బిల్లు కాదు, రాజ్యాంగబద్దమైన బిల్లు కావాలని  సుజనాచౌదరి నినాదాలు చేశారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ అని  సీఎం రమేష్ ప్లకార్డు పట్టుకున్నారు. తెలంగాణ కావాలని  అదే టీడీపీ పేరుతో గుండు సుధారాణి ప్లకార్డు పట్టుకున్నారు.
* ప్యానల్ చైర్మన్ హొదాలో అనూహ్యంగా రేణుకా చౌదరి కొద్దిసేపు సభ నిర్వహించారు.
* బిల్లు చదివిన తరువాత హొగయా.. అని షిండే డిప్యూటీ ఛైర్మన్కు చెప్పారు.
* బిల్లుకు వ్యతిరేకత తెలుపుతూ డిఎంకె, జెడియు సభ్యులు రాజ్యసభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
* లోక్సభలో అప్రజాస్వామికంగా ఆమోదించన బిల్లును రాజ్యసభకు తెచ్చారని ఇతర రాష్ట్రాల సభ్యులు ప్లకార్డులు పట్టుకున్నారు.
*  బిల్లుకు వ్యతిరేకంగా చైర్మన్ పోడియం వద్ద నిలబడి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయారు.
* సభ జరిగినంతసేపూ పలువురు సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
* దుష్ట సంప్రదాయాలను ప్రారంభించారని  ఎస్పీ, తృణమూల్, జేడీయూ సభ్యులు మండిపడ్డారు.
బిల్లుపై చర్చకు  డిప్యూటీ ఛైర్మన్ అనుమతించారు.
* గందరగోళం మధ్యలోనే అన్ని పార్టీల సభ్యులు బిల్లుపై, రాష్ట్ర విభజనపై తమతమ అభిప్రాయాలు చెప్పారు.
* సభ్యుల ప్రసంగాల తరువాత చివరగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు.
ప్రధానికి రక్షణగా కాంగ్రెస్ సభ్యులు నిలబడ్డారు.
* మాయావతి, ప్రధాని ప్రసంగాలను తృణమూల్ సభ్యులు అడ్డుకున్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిందని డిప్యూటీ చైర్మన్ కురియన్  ప్రకటించారు.
ఓటింగ్కు పట్టుబట్టిన వెంకయ్య నాయుడు - అంగీకరించని కురియన్
క్లాజులవారీగా బిల్లుపై మూజువాణి ఓటింగ్ జరిగింది.
* చివరగా బిల్లు సభ ఆమోదం పొందిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు.
సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.

సభలో ఎవరేమన్నారంటే...

* ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్:  అన్ని ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని.  అయిదు సంవత్సరాలపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి .  బుంధేల్ఖండ్ తరహాలో సీమాంధ్రకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు.  రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీ. ఆదాయం, ఆస్తులు, సిబ్బంది పంపిణీ తరువాతే రాష్ట్ర విభజన. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస బాధ్యతలను   కేంద్రమే చేపడుతుంది.
* బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు: తెలంగాణకు  సమ్మతమే, అయితే సీమాంధ్రకు న్యాయం జరగాలి.
* ప్రతిపక్ష బిజేపి నేత అరుణ్ జైట్లీ : రాజ్యాంగ సవరణలు లేకుండా గవర్నర్కు అధికారాలు ఎలా ఇస్తారు?
గవర్నర్ కేంద్రానికి ప్రతినిధి మాత్రమే. లోపాల బిల్లును ఎందుకు ఆమోదించాలి?
* సిపిఎం సభ్యుడు సీతారామ్ ఏచూరి: రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం.  తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని చీల్చడం దారుణం.
కేంద్ర మంత్రి చిరంజీవి: కాంగ్రెస్ నిర్ణయానికి కట్టబడి ఉంటాను.  ప్రజల ఆవేదనను కూడా పట్టించుకోవాలన్నదే నా విజ్ఞప్తి. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమాత్రం చర్చ జరగకుండా ఆమోదించారు. అది చాలా దురదృష్టకరం.
* బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి :  తెలంగాణ బిల్లుకు మేం  అనుకూలం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరికాదు.  పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అంటే చాలా ఎక్కువ కాలం.
* కనిమొళి: అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.సమైక్య స్పూర్తిని దెబ్బతీశారు.
*కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన కారణమైతే, బిల్లు ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ కూడా ఒక కారణమన్నారు.
* జేడీయూ సభ్యుడు ఎన్.కె.సింగ్ : బిల్లులో ఆర్థికపరమైన ప్యాకేజీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదు. లక్ష్యాలేమిటో, ఉద్దేశాలేమిటో చెప్పకుండా, రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజనకు పూనుకోవడం ఎంత మాత్రం తగదు.
* లోక్‌ జనశక్తినేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌:  తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. యూపీని కూడా విభజించాలి.
* ఏజీపీ, అస్సాం సభ్యుడు బీరేంద్ర ప్రసాద్‌ బైశ్య:  బిల్లు రాజ్యాంగ విరుద్ధం. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు ఎలా తీసుకు వస్తారు? దేశం సమైక్య స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఈ బిల్లును ఆమోదించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపొద్దు. రేపు ఏం జరిగినా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది తప్పుడు విధానంతో వచ్చిన బిల్లు దయచేసి బిల్లును అడ్డుకోండి.
* శిరోమణి అకాలీదళ్‌ సభ్యుడు నరేష్‌ గుజ్రాల్‌ : తెలుగు ప్రజలతో ఆడుకున్నారు. బిల్లు తీరు చూస్తే ఏపీలో హింస పొంచి ఉన్న సూచనలు కనపిస్తున్నాయి. చండీగఢ్‌ ఐదేళ్ల రాజధాని అన్నారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కొన్నిరోజుల్లో ఇంటికెళ్లబోయే కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది.
సీపీఎం నేత డి.రాజా: తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. చిన్నరాష్ట్రాలకు మేం అనుకూలం. విభజన తీరు వ్యవహారంలో కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదు.
* ఎన్‌సీపీ సభ్యుడు డాక్టర్‌ జనార్దన్‌ : బిల్లుకు మేం మద్దతు పలుకుతున్నాం.
రాంగోపాల్‌ సింగ్‌ యాదవ్‌ (ఎస్పీ): పెద్దరాష్ట్రాలు జాతీయ సమైఖ్యతకు చిహ్నం. నెహ్రూ, ఇందిరలు విభజనను వ్యతిరేకించారు.
శశిభూషణ్ బెహరా(బీజేడీ, ఒడిశా) పోలవరం ప్రాజెక్టుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వ్యతిరేకం. ఇప్పటికే ఇది కోర్టు పరిధిలో ఉంది. రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులు బిల్లుకు చాలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement