మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి:మాయావతి
న్యూఢిల్లీ: ఎస్సార్సీ వేసి మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్నారు. చిన్న రాష్ట్రాల డిమాండ్ చాలా కాలంగా ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరు చేయాలని కోరారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ అనుకూలం అని చె్ప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సరికాదన్నారు. అలా అయితే ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని చెప్పారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అంటే చాలా ఎక్కువ కాలం అన్నారు.
గతంలో మూడు రాష్ట్రాలకు కొత్త రాజధానులను ఏర్పాటు చేశారని చెప్పారు. సీమాంధ్రకు, అలాగే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయాలన్నారు.రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. మాయావతి ప్రసంగానికి తృణమూల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.