గందరగోళం మధ్య ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు రాజ్యసభలో సభ్యుల ఆందోళన మధ్య ఒక ప్రకటన చేశారు. మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని విపక్ష నేతలు అడ్డుకున్నారు. సభ్యుల గొడవ కారణంగా ప్రధాని ప్రకటన వినిపించలేదు. ప్రధాని ఒక పక్క మాట్లాడుతుంటే కొందరు సభ్యులు తెలంగాణ బిల్లు పేపర్లు చించిపారవేశారు.
అన్ని ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ప్రధాని చెప్పారు. హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. అయిదు సంవత్సరాలపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి - బుంధేల్ఖండ్ తరహాలో సీమాంధ్రకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామిన చెప్పారు. రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఆదాయం, ఆస్తులు, సిబ్బంది పంపిణీ తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస బాధ్యతలను కూడా కేంద్రమే చేపడుతుందన్నారు.
సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పది సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు కోరారు. కొత్త రాజధాని పేరు ప్రకటించాలని కూడా బిజెపి కోరింది. బిజెపి డిమాండ్లను అంగీకరించలేదు. ప్రధాని ప్రకటన చేసే సమయంలో ఆయన చుట్టూ కాంగ్రెస్ ఎంపిల రక్షణగా నిలిచారు.