ఏపీఆర్ అంటే?
మన ఆర్థిక కార్యకలాపాల్లో ఏపీఆర్‌కు (యాన్యువల్ పర్సంటేజ్ రేట్-వార్షిక రేటు శాతం) ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరీ ముఖ్యంగా గృహ రుణం తీసుకునే సమయంలో ఈ పదాన్ని విరివిగా వాడతాం. తీసుకున్న రుణానికి అయ్యే వార్షిక వ్యయాన్నే ఏపీఆర్‌గా పరిగణిస్తాం. ఫీజులు కూడా ఇందులోనే ఉంటాయి. వడ్డీ రేట్ల మాదిరిగానే ఏపీఆర్‌ను కూడా శాతాల్లోనే వెల్లడిస్తారు. అయితే ఇక్కడ వడ్డీ రేట్లలో ఫీజులు సహా ఇతర రుసుములు కలిసి ఉండవు. ఏపీఆర్‌లో అయితే ఇవన్నీ మిళితమై ఉంటాయి.
దీంతో ఇక్కడ మనం ఒక రుణానికయ్యే అయ్యే మొత్తం వ్యయంపై ఒక అంచనాకు రావొచ్చు. క్రెడిట్ కార్డు జారీ సమయంలో లేదా గృహ రుణం తీసుకునేటప్పుడు ఈ ఏపీఆర్ అనే పదం మన దృష్టికి వస్తుంది. రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటును ఎలాగైతే తెలుసుకుంటామో.. ఏపీఆర్ విలువ కూడా ఎంతుందో చూడాలి.. అప్పుడే మనం తీసుకున్న రుణానికి నిజంగా ఎంత చెల్లిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా వడ్డీ రేట్ల కన్నా ఏపీఆర్ విలువ ఎక్కువగా ఉంటుంది.