ప్రశ్నార్థకంగా మారిన బేడీ భవితవ్యం
న్యూఢిల్లీ: ‘ఇది నా ఓటమి కాదు. ఇది బీజేపీ ఓటమి’ ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన అవమానకర ఓటమిపై బీజేపీ నాయకురాలు కిరణ్‌బేడీ స్పందన ఇది. మాజీ పోలీస్ అధికారి అయిన కిరణ్ బేడీ వీలుకుదిరినప్పుడల్లా రాజకీయ నాయకులపై విరుచుకుపడుతుండేవారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులను వేదిక కూడా ఎక్కనివ్వని ఆమె, అనుకోనిరీతిలో బీజేపీలో చేరడం, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎన్నికవడం, ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకతతో ఘోర ఓటమిని మూటగట్టుకోవడం అంతా రెండు వారాల వ్యవధిలోనే జరిగిపోయింది.
ఈ ఎన్నికల్లో చవిచూసిన ఓటమితో అప్పుడే ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కిరణ్‌బేడీ పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో అనేక క్లిష్ట పరిస్థితులను చాకచక్యంతో ఎదుర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున రాజకీయ నాయకురాలిగా అరంగేట్రం చేశారు. ఈ ఎన్నికలే ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అతి క్లిష్టమైన పరీక్ష. ‘టఫ్ టాస్క్ మాస్టర్’గా పేరుగాంచిన బేడీని ముందుపెట్టి ఢిల్లీ పీఠం ఎక్కాలని బీజేపీ భావించింది. దీంతో 1993 తర్వాత అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికలుగా ఇవి మారిపోయాయి. కానీ ఫలితాలకు వచ్చేసరికి బేడీ నేతృత్వంలోని బీజేపీ కేవలం మూడు నియోజకవర్గాలకే పరిమితమైపోయింది.
సాక్షాత్తూ బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన బేడీ... కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఎస్.కె.బగ్గా చేతిలో ఓటమి పాలయ్యారు. 1993 నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేంద్రమంత్రి హర్షవర్ధ(బీజేపీ) గెలుపొందుతూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బేడీపై గెలుపొందిన ఎస్.కె.బగ్గాకి మితభాషి, మంచి వ్యక్తిగా ప్రజల్లో పేరుంది. బగ్గా స్థానిక వ్యక్తి కాగా బేడీ బయటి నుంచి వచ్చి పోటీ చేశారు. ఆమె ఓటమికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతే కాకుండా బేడీ పాల్గొన్న సభలకు ప్రజాదరణ కూడా అంతంత మాత్రమే లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలు కూడా పేలవంగా మారాయి.
ఢిల్లీ ఐరన్ లేడీగా ముద్ర ఉన్న బేడీ... 1982లో కన్నాట్ సర్కస్ వద్ద పార్కు చేసి ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కారును నెట్టుకుపోవడం వంటి ఘటనలు గురించిన వార్తలు ఈ ఎన్నికల సమయంలో హల్‌చల్ చేశాయి. దీంతో ‘ఒక డీసీపీ ఎప్పుడూ అలాంటి పనులు చేయరని’ ఆ ఘటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నా నష్టం మాత్రం జరిగిపోయింది.