వాట్సప్ ఎలా పుట్టిందో తెలుసా..!
వాషింగ్టన్: పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. శుభాకాంక్షలు తెలపడానికి మనం తరచుగా ఉపయోగించే మాధ్యమం సోషల్ మీడియా. గతంలో ఫేస్ బుక్ సంచలనాలు సృష్టించగా... ప్రస్తుతం దాని స్థానాన్ని వాట్సప్ ఆక్రమిస్తోంది. అసలు ఈ వాట్సప్ యాప్ ఎలా వచ్చింది.. దాని రూపకర్తలు ఎవరు, దానిని ఎప్పుడు తయారు చేశారు, దాని పుట్టిన రోజు ఎప్పుడో మీకు తెలుసా..?
వాట్సప్ నేటితో సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. యాహూకు చెందిన ఇద్దరు ఉద్యోగులు బ్రియాన్ యాక్షన్, జాన్‌కౌన్ లు ఈ యాప్ రూపకల్పనకు పునాది వేశారు. యాహూ కంపెనీ నుంచి బయటకు వచ్చిన బ్రియాన్, జాన్ లు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో వీళ్లు మరో స్నేహితుడు అలెక్స్ ఫిష్‌మాన్ తో కలిసి 2009 ఫిబ్రవరి 24న వాట్సప్ సంస్థను స్థాపించారు.
మొదట్లో కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా మరికొందరు మిత్రుల రెండున్నర లక్షల సీడింగ్ ఫండ్ పెట్టుబడులతో బీటా యాప్‌ను వృద్ధి చేశారు. ఎన్నో పరీక్షలు జరిపిన అనంతరం 2009 నవంబర్‌లో వాట్సప్, ఆపిల్ స్టోర్‌లో విడుదలైంది. అదే ఏడాది డిసెంబర్‌లో ఫొటోలు పంపుకొనే అవకాశం కల్పించింది. బ్రియాన్ యాక్షన్, జాన్‌కౌన్‌లకు ఉద్యోగాన్ని నిరాకరించిన అదే ఫేస్‌బుక్ కంపెనీ 2014 ఫిబ్రవరి 19న 19బిలియన్ అమెరికన్ డాలర్లకు వాట్సప్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఫొటోలు, వీడియోలు, సందేశాలు పంపించడానికి అత్యధికంగా ఉపయోగించే యాప్స్ లో వాట్సప్ ఒకటి.