మనకూ ముంచుకొస్తున్న జికా ముప్పు!
లండన్: ఆగ్నేయ ఆసియా దేశమైన సింగపూర్ లో తాజాగా జికా వైరస్ కనిపించిన నేపథ్యంలో మిగిలిన ఆసియా దేశాలకూ ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గణనీయంగా మారుతున్న వాతావరణ, విదేశీ ప్రయాణాలు, దోమల బెడదలను బట్టి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వీటిలో భారత్, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, నైజీరియా, వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు జికా వైరస్ పాకే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ దేశాల్లోని ప్రజలకు గతంలోనే జికా వైరస్ సోకినా.. వ్యాధి లక్షణాలు, తీవ్రత బయటకు కనిపించకపోవడం వల్ల గుర్తించలేకపోయి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. వాస్తవానికి 1947లోనే జికా వైరస్ ను గుర్తించినా.. వ్యాధి కారణంగా పెద్దగా ఆరోగ్యసమస్యలేవీ లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. గత ఏడాది బ్రెజిల్ లో గర్భస్థ శిశువులు, గర్భిణీ స్త్రీలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపింది.
దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ ఓ) జికా వైరస్ వ్యాప్తిపై ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 70 దేశాల్లో జికా ఆనవాళ్లు ఉన్నాయని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. దోమల ద్వారా, సెక్స్ , రక్త మార్పిడిల ద్వారా జికా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. తాము చేసిన పరిశోధనలు దేశాలు నష్టాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు అన్నారు.