ఆదరణకు నోచుకోని యాప్స్!
న్యూయార్క్: నేటి తరం యువత స్మార్ట్ ఫోన్ల క్రేజ్ లో మైమరిచిపోతున్నా.. యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఆ యాప్ లను ఫ్రీగా పొందే అవకాశం ఉన్నాకూడా డౌన్ లోడ్ చేసుకోవడానికి వెనుకడుగే వేస్తున్నారట. ఈ మధ్య కాలంలోవరుసగా వచ్చిపడుతున్నయాప్ లను పెద్దగా పట్టించుకోని జనం.. వారికి ఉపయోగం ఉన్న వాటినే మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. అలా డౌన్ లోడ్ చేసుకుంటున్న వాటిలో ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్, వాట్సప్, యాహూలకు మాత్రమే ప్రముఖస్థానం ఉందని అమెరికన్ అంతర్జాల విశ్లేషణ సంస్థ స్పష్టం చేసింది.
అసలు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్న అధిక శాతం మంది ప్రజలు ఎందుకు యాప్ ను డౌన్ చేసుకోవడం లేదు అనే అంశంపై చేసిన సర్వేలో పలు విషయాలు వెలుగు చూశాయి. అమెరికాలోని స్మార్ట్ ఫోన్లు ఉన్న ముగ్గురిలో కనీసం ఒక్కరు మాత్రమే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి సుముఖత చూపుతున్నారని సర్వే విశ్లేషించింది. అయితే వ్యక్తిగతంగా ఉపయోగించే యాప్ లకు మాత్రం అధికశాతం మంది డౌన్ లోడ్ కు మొగ్గు చూపుతుండగా, కొన్ని యాప్స్ మాత్రం ఎలా వస్తున్నాయో అలానే మాయం అవుతున్నాయని సర్వే పేర్కొంది.