రైతులు తిడుతున్నారు!
ప్రధాని మోదీ పతనాన్ని లిఖించుకుంటున్నారు
* యూపీ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్
మథుర: దేశంలోని అన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకుంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పతనాన్ని తానే రాసుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో రైతులు ప్రధాని మోదీని విమర్శించడం కాదు.. దూషిస్తున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. మోదీ నిష్ర్కమణ తథ్యమని, ఆ సమయంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతల సదస్సును సోమవారం రాహుల్ ప్రారంభించి, ప్రసంగిస్తూ.. మోదీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ ఏమన్నారంటే..
* మోదీ రైతులకు మంచి రోజులొస్తాయన్నారు. కానీ వారిప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు మోదీని మామూలుగా విమర్శించడం కాదు, దూషిస్తున్నారు. మనమంతా కలిసి కలిగించే నష్టం కన్నా ఎక్కువ నష్టం మోదీ తనకు తానే చేసుకుంటున్నారు.
* మోదీ యువతకు ఉద్యోగాలన్నారు. ప్రతీ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ. 15 లక్షల నల్లధనాన్ని జమ చేస్తామన్నారు. ఇవేవీ అమలుకాలేదు. గత 16 నెలలుగా ఆయన మాటలకే పరిమితమయ్యారు.
* కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆరెస్సెస్‌లాంటిది కాదు. ఇక్కడ అందరి వాణి వినిపిస్తుంది.
* స్టీవ్ జాబ్స్ ప్రారంభించిన ప్రముఖ సంస్థ ఆపిల్’లా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి. కొద్దిమంది నేతల అభిప్రాయాలే కాకుండా కార్యకర్తలందరి అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
* యూపీలో కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది. కానీ సైద్ధాంతికంగా మనదే తొలి స్థానం. మోదీ, ఆరెస్సెస్‌లు కాంగ్రెస్‌కు వ్యతిరేకమే కానీ వాస్తవానికి తమ విధానాలతో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు.
* అభిప్రాయభేదాల్ని చర్చల్తో పరిష్కరించుకోండి. నా చిన్నప్పుడు మా నాన్న తన పెద్దరికంతో నా నోరు మూయించవచ్చు. కానీ ఆయన అలా ఎప్పుడూ చేయలేదు. మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన మా మాట వినేవారు. తన వాదన వినిపించేవారు. కాగా, ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ నిర్మల్ ఖత్రి, సీఎల్పీ నేత ప్రదీప్ మాథుర్ సహా రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు, మాజీ కేంద్రమంత్రులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ భూ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాహుల్ చేసిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని ఖత్రి పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్రం నుంచి కేవలం రాహుల్, సోనియా మాత్రమే గెలుపొందారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 403 స్థానాలకు గానూ 28 సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది.
రాహుల్ అబద్ధాల కోరు: బీజేపీ
రాహుల్ అబద్ధాలకోరు, నిరాధార ఆరోపణలు చేయడంలో నిపుణుడని బీజేపీ ధ్వజమెత్తింది. బీజేపీ, ఆరెస్సెస్ సంబంధాల గురించి మాట్లాడేముందు ఎమెర్జెన్సీ, కుంభకోణాల కాంగ్రెస్ చరిత్రను పార్టీ కార్యకర్తలకు వివరించాలని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ రాహుల్‌కు సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ మోదీ ఆకర్షణ పెరుగుతుండటంతో తట్టుకోలేక రాహుల్‌గాంధీ అబద్ధాలతో దుష్ర్పచారానికి దిగుతున్నారని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఆరోపించారు.