
ఆమిర్‌కు రజనీ ఎందుకు నో చెప్పాడు?
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ తాజా సినిమా 'దంగల్'. రెజ్లింగ్ నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'దంగల్'లో ఆమిర్ ఖాన్ పాత్రకు తమిళంలో డబ్బింగ్ చెప్పాలని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చిత్రయూనిట్ ఆశ్రయించిందట. మరి, ఆయన ఎందుకు నో చెప్పాడంటే.. ఆ విషయాన్ని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు.
'దంగల్‌ను తమిళంలో, తెలుగులో డబ్ చేశాం. నేనే స్వయంగా రజనీ సర్‌ను అప్రోచ్ అయ్యాను. ఆయన సినిమా ఎంతగానో నచ్చింది. తమిళంలో సినిమాను డబ్ చేయడాన్ని ఆయన ప్రోత్సహించారు. అయితే, తమిళంలో నా పాత్రకు రజనీ సర్ డబ్బింగ్ చెప్పే విషయమై ఇద్దరం వివరంగా చర్చించాం. నా పాత్రకు రజనీ గొంతు అందిస్తే.. దానిని ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆయన చాలా పాపులర్. అంతేకాకుండా ఆయన గొంతు నాకు సరిపోదు. మేం ఇద్దరం ఇదే భావించాం. అయితే, సినిమా ఆయనకు ఎంతగానో నచ్చింది. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు' అని ఆమిర్ తెలిపారు. హర్యానా రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫొగట్ పాత్రలో రెండు అవతారాల్లో ఆమిర్ ఈ సినిమాలో అలరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.