
ఎందుకు బాబూ.. బందరు పైపు?
భవిష్యత్తులో మచిలీపట్నంలో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పరిశ్రమల కోసం ఇప్పుడే పైప్‌లైన్!!
⇒ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మచిలీపట్నం వరకు ఏర్పాటు
⇒ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. రూ.600 కోట్ల అంచనా.. కోట్లలో కమీషన్లకు వ్యూహం!
⇒ ప్రకాశం బ్యారేజీలో కృష్ణా డెల్టా సాగు, తాగునీటి అవసరాలకే నీళ్లులేని పరిస్థితి
⇒ తమిళనాడులా సముద్రపు నీరు శుద్ధిచేసే ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో ఎప్పుడో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పారిశ్రామికవాడకు నీళ్లివ్వడానికి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రకాశం బ్యారేజీలో 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితే లేదు. కృష్ణా డెల్టా పరిధిలో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నీళ్లులేని కారణంగా ఈ ఏడాది రబీకే అవసరమైన సాగునీటిని అందించలేకపోవడంతో పంటలు ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు మచిలీపట్నానికి అత్యంత చేరువలో ఉన్న సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని అక్కడ ఏర్పడబోయే పరిశ్రమలకు వాడుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది.
ఇప్పటికే తమిళనాడు అక్కడి తీర ప్రాంతాల్లోని పారిశ్రామిక నీటి అవసరాలను, తాగునీటి సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేసేందుకు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పైప్‌లైన్ పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ప్రభుత్వం పైప్‌లైన్ నిర్మాణానికి పూనుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్టు నివేదిక రెడీ.. టెండర్లకు సిద్ధం
మచిలీపట్నంలో బందరు ఓడరేవు, దానికి అనుబం ధంగా వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం మచిలీప ట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మడ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓడరేవు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని, అప్పుడు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొంటూ నీటిపారుదల శాఖ ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. ప్రస్తుతం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 64 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రహదారికి సమాంతరంగా భారీ పైపులైన్ ఏర్పాటు చేసేలా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. నివేదిక అందినదే తడవుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీలో నీళ్లేవీ..?
ప్రకాశం బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు, కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు వెళుతుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, ఇతర మునిసిపాలిటీలతో పాటు డెల్టా కాలవల పరిధిలోని చెరువులను నింపడం ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు ఇక్కడినుంచే అందుతుంది. ఒక్క విజయవాడ నగరానికే రోజుకు 165 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల నీటి సరఫరా జరుగుతుంది. గుంటూరు నగరానికి 90 ఎంఎల్‌డీలు సరఫరా అవుతున్నాయి. అయితే ఇప్పటికే సాగు, తాగునీటికి కొరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బందరులో పారిశ్రామిక అవసరాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఎలా తరలిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఉప్పునీటి శుద్ధి ప్రత్యామ్నాయం ఉందిగా..
మచిలీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటైతే సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పరిశ్రమలకు తరలించేందుకు అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఉత్తర చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం 2013 లోనే కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని నెమ్మెలీలో సముద్రపు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించింది. అక్కడ ప్రతిరోజూ పదికోట్ల లీటర్ల శుద్ధీకరణ జరుగుతోంది. రామనాథపురం జిల్లా కడలాడి ప్లాంట్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీప ఐవీఆర్‌సీఎల్ ప్లాంట్‌లు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాయి. మచిలీపట్నంలో ఇలాంటి ప్లాంట్‌లు ఏర్పాటుచేస్తే సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటిని పరిశ్రమలకు తరలించాల్సిన పని ఉండదని సాగు నీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కమీషన్లు దండుకునేందుకే..
ఎప్పుడో రాబోయే బందరు పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం ఇప్పుడు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వెనుక అసలు కారణం వేరే ఉందని సాగునీటిశాఖ ఇంజనీర్లే అంటున్నారు. గతంలో పలు ప్రాజెక్టులు దక్కించుకుని భారీగా కమీషన్లు ముట్టజెప్పిన కాంట్రాక్టు సంస్థకే ఈ టెండరును కూడా కట్టబెడితే మళ్లీ కోట్ల మొత్తంలో కమీషన్లు దండుకోవచ్చనేది ప్రభుత్వ వ్యూహమని చెబుతున్నారు. ఆ పనులు పొందిన సంస్థ పైపులైన్ నిర్మాణంలో అనుభవం కలిగి ఉండటంతో ఆ సంస్థకే టెండరు దక్కే విధంగా నిబంధనలు రూపొందించే పనిలో అధికారులున్నట్టు సమాచారం.