
భర్త శవంతో టూర్‌కు వెళ్లింది!
ఓ అమెరికన్ మహిళ తన భర్త మృతదేహాన్ని వాహనంలో పెట్టుకొని రోడ్డుప్రయాణాలు చేసింది. 78 ఏళ్ల తన భర్త మృతదేహాన్ని ఓ అల్యూమినియం శవపేటికలో పెట్టుకొని.. తను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లింది. శవం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఎప్పుడూ ఐస్‌ను వినియోగించింది. అయితే, అమెరికాలోని అలస్కాలో ఆమె శవంతో తిరుగుతుండటంతో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆమె భర్త శవంతో కొన్నిరోజులుగా ప్రయాణం చేస్తున్నదని, వాహనంలోని మృతదేహం ఉన్న పేటికలో ఐస్ అయినప్పుడల్లా దానిని కొనేందుకు మాత్రమే వాహనాన్ని ఆపేదని పోలీసులు తెలిపారు. భర్త మృతదేహాన్ని ఆమె నేరుగా మార్చురీకి తీసుకెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల తీసుకెళ్లకెళ్లలేదని, భర్తతో కలిసి కొన్నిరోజులు ప్రయాణాలు చేయాలని ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని స్థానిక పోలీసు అధికారి వివరించారు. స్థానికంగా రోలింగ్ వేక్ వార్షిక ఉత్సవం జరుగుతుండటంతో భర్తతో కలిసి ఆ ఉత్సవానికి వెళ్లాలని ఆమె ఇలా చేసి ఉండొచ్చునని వివరించారు. ఆమె భర్త సహజంగానే మరణించారని, ఈ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి అభియోగాలు మోపలేదని పోలీసు అధికారి చెప్పారు. ఆమె భర్త శవాన్ని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న మార్చురీకి తరలించామని, మళ్లీ తన భర్త శవం కోసం ఆమె రాబోదని ఆశిస్తున్నామని తెలిపారు.