
‘చర్చపై సీఎం, స్పీకర్‌ల నుంచి వివరాలు తెలుసుకుంటా’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ వివరాలను ముఖ్యమంత్రి, స్పీకర్‌లను అడిగి తెలుసుకుంటానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి విధించిన గడువు దగ్గరపడుతున్నా చర్చ పూర్తి కాలేదని, పొడిగింపు ఉంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఇప్పటివరకైతే 23 వరకు గడువుంది. చర్చ కొనసాగుతోంది. సీఎం, స్పీకర్‌లతో మాట్లాడి చర్చకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటా’ అని సమాధానమిచ్చారు. గడువు పెంచాలని సీమాంధ్ర నేతలు చేస్తున్న విజ్ఞప్తిపై ఆయన స్పందించలేదు. చర్చ పూర్తయ్యేందుకు మరో రెండు రోజుల సమయముంది కదా.. అని అన్నారు.