టూర్‌లో విషాదం.. పొరపాటున భర్తను చంపేసింది
బెంగళూరు: బెంగళూరులో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబం కేరళలోని మున్నార్‌కు విహారయాత్రకు వెళ్లగా, విషాదాన్ని మిగిల్చింది. భార్య ప్రమాదవశాత్తూ కారుతో.. సైకిల్‌తో వెళ్తున్న భర్తను ఢీకొట్టడంతో ఆయన మరణించాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
అశోక్ సుకుమారన్ నాయర్, రేష్మి దంపతులు తమ పిల్లలు శ్రద్ధ (7), శ్రేయ (5)లతో కలసి మున్నార్‌కు వెళ్లారు. అశోక్ సరదాగా సైకిల్‌పై రైడింగ్‌కు వెళ్లాడు. ఆయన వెనుకే రేష్మి పిల్లలతో కలసి కారులో వెళ్తోంది. కాగా పిల్లలు స్టీరియో సిస్టమ్ సౌండ్ ఎక్కువగా పెట్టడంతో.. డ్రైవింగ్ చేస్తున్న రేష్మి తగ్గించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె నియంత్రణ కోల్పోయి కారుతో ముందు వెళ్తున్న భర్తను ఢీకొట్టింది. అశోక్ తలకు తీవ్రగాయమైంది. రేష్మి తన భర్తను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అశోక్ శరీరంపై పెద్ద గాయాలు కాకపోయినా, తలకు తగలడంతో ముక్కులోంచి ఎక్కువగా రక్తస్రావమై చనిపోయాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవని, రేష్మి విషాదం నుంచి కోలుకోలేదని పోలీస్ అధికారి చెప్పారు. అశోక్, రేష్మిలది కేరళ కాగా, ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు.