అలజడి; అసెంబ్లీలోనికి దూసుకెళ్లిన మహిళ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో కలకలం చెలరేగింది. శాసన మండలి జరుగుతుండగా, ఓ మహిళ.. చైర్మన్ పోడియంవైపు దూసుకురావడంతో సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్రమత్తమైన మార్షల్స్.. ఆమెను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. నిమిషాల తర్వాతగానీ అతికష్టం మీద ఆమెను బయటికి ఈడ్చిపారేశారు. సదరు మహిళ అసెంబ్లీలో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగిని కావడంతో ఆమె చర్యపై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది.
మంగళవారం శాసన మండలి కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది సేపటికే, కాంట్రాక్టు పద్ధతిపై అసెంబ్లీలో క్లాస్-4 ఉద్యోగినిగా పనిచేస్తోన్న మహిళ.. సభలోకి పరుగున వచ్చి, చైర్మన్ పోడియం ముందు నిలబడింది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే ఈ విధంగా నిరసన తెలిపానని అరెస్ట్ అనంతరం ఆమె మీడియాకు చెప్పారు. కాగా, ఉద్యోగిన చర్య.. శాసన సభలో భద్రతాలేమిని తేటతెల్లం చేసిందని అధికార బీజేపీ పక్షనేత, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ అన్నారు. అసెంబ్లీలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
అయితే, నిరసన తెలిపేందుకు సభలోనికి రావడం మహిళా ఉద్యోగిన చేసిన తప్పే అయినప్పటికీ, ఆమె పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరు మాత్రం సహేతుకంగా లేదని విపక్షాలకు చెందిన మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. సర్దిచెప్పి పంపేయాల్సిదిపోయి, మహిళను ఈడ్చుకెళ్లడం సరైందికాదని ఆక్షేపించారు. కాగా, సదరు మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సిఉంది.